జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని
అంచనా వేయండి
ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి
యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరదల నష్టంపై అధికారులతో సమీక్ష
వరంగల్, సెప్టెంబరు 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవలి కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పరిశీలించి నష్టాలను అంచనా వేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రెండుమూడు రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, ఉపాధి హామీలో చేపట్టిన రోడ్లు, పీఎంజీఎస్వై రోడ్ల పురోగతి, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుపై హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. ప్రతి ఊరు, మండలం, జిల్లాల వారీగా సమాచారం సేకరించాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం వరంగల్ సర్కిల్ ఎస్ఈ జోగారెడ్డి, డీఈ శంకరయ్య, అధికారులు పాల్గొన్నారు.