ములుగు, సెప్టెంబర్9(నమస్తేతెలంగాణ): గణపతి నవరాత్రుల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపాల వద్ద కరోనా నియమాలు పాటించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంతోపాటు మేజర్ గ్రామ పంచాయతీలైన జంగాలపల్లి, గోవిందరావుపేట, వెంకటాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, కమాలాపురం, మంగపేట, పలు గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో విగ్రహాల విక్రయ కేంద్రాలు మూడు రోజులుగా కొనుగోలు దారులతో సందడిగా మారాయి. రూ.2000 నుంచి రూ.20,000 వరు ధర కలిగిన విగ్రహాలను ములుగులో విక్రయించారు. మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీ సభ్యులు ఆన్లైన్లో అనుమతులు పొంది ఆయా పోలీస్ స్టేషన్ల అధికారుల సూచనలతో నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించనున్నారు.