జనగామ, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : మెరుగైన విద్యే లక్ష్యంగా సర్కారు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ సత్ఫలితాలిస్తున్నది. పేదల కోసం కేజీ టు పీజీ విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అమలు చేస్తుండడంతో ఈ సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య సైతం పెరిగింది. జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 516 ప్రభుత్వ పాఠశాలున్నాయి. కేటగిరీల వారీగా 341 ప్రాథమిక, 64 ప్రాథమికోన్నత, 103 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండగా వీటిలో 36,136 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది జిల్లాలో 34,108 మంది విద్యార్థులు మాత్రమే సర్కారు స్కూళ్లలో ఉన్నారు. కరోనా అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతుండడంతో ఈసారి కొత్తగా 2,028 మంది చేరారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండడం, కార్పొరేట్‌కు ధీటుగా బోధన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ప్రతి విద్యార్థికీ కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన, జిల్లాల పునర్విభజన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నది. ఒకప్పుడు ఇంగ్లిష్ విద్య అంటే ప్రైవేట్‌కు పరిమితం అయితే ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో ప్రారంభించి ధీటైనా విద్యను బోధిస్తున్నది. జిల్లాల పునర్విభజన త ర్వాత జిల్లాలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ స్థాయిలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థుల్లో శారీరక ఇబ్బందులు దూరం చేయడం సహా వారి ఆరోగ్యంగా ఉంచేలా విద్యాశాఖ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని సరిచేసేందుకు సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలకు ఇప్పటికే వారానికి రెండుసార్లు గుడ్లు, ప్రతిరోజూ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నది. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తూ ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నది. విద్యార్ధుల తల్లిదండ్రుల పర్యవేక్షణలో పకడ్బందీగా పాఠశాలలను నిర్వహించేందుకు వీలుగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లను ఎన్నికలు నిర్వహిస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించే బాలికలపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంత బాలికల విద్యను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న 12 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నది. జిల్లాలో 49 మంది బాలికలకు ప్రయోజనం చేకూరే విధంగా 12మాసాలకు సరిపోయే విధంగా ఆరోగ్య రక్షా కిట్లు అందజేస్తుండగా, ఇందుకోసం ప్రభు త్వం ఒక్కో విద్యార్థికి రూ.1600 ఖర్చు చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ నాణ్యమైన విద్యాబోధన దిశగా ముందుకు సాగుతున్నది.
కేంద్రీయ విద్యాలయానికి ప్రతిపాదన..
జనగామ జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 516 పాఠశాలల్లో మొత్తం 36,136 మంది విద్యార్థులు చదువుతుండగా వీటిలో 341 ప్రాథమిక పాఠశాలల్లో 12, 285 మంది, 64 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,867 మంది, 103 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 16,001 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతేడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 34,108 మంది విద్యార్థులు మా త్రమే ఉండగా కరోనా తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపుతుండడంతో ఈసారి కొత్తగా 2028 మంది విద్యార్థులు సర్కార్ బడులకు వస్తున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుతో పాటు జిల్లాలో 11కేజీబీవీలు, 9మోడల్ స్కూళ్లు, 7 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండగా, వచ్చే ఏడాది నాటికి జిల్లాలో కొత్తగా మరో రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తుండగా, జిల్లాల పునర్విభజన తర్వాత జరిగిన పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతంలో జనగామ జిల్లా రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. ప్రభు త్వ బడుల్లో ఏటేటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి సంస్కరణల అమలుపై దృష్టి సారించింది. ఇప్పటికే పిల్లలు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లను సర్ధుబాటు చేశారు. ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకునేందుకు పూర్వ ప్రాథమిక తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది.
అంగన్వాడీ నుంచి సర్కారు బడికి..
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ఐదేళ్లలోపు పిల్లలకు ఆటపాటలతో ఆంగ్ల అక్షరాలను నేర్పిస్తున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఐదేళ్లు నిండిన బాల బాలికలను మాత్రమే సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో చేర్చుకుంటారు. అదే ప్రైవేట్ పాఠశాలలు మాత్రం రెండున్న నుంచి మూడేళ్లు నిండిన చిన్నారులను ఆంగ్లమాధ్యమంలో నర్సరీలో చేర్చుకుంటున్నారు. ఇలా చేరిన విద్యార్థులు ఎల్కేజీ, యూకేజీ నుంచి ఆ తర్వాత అందులోనే ఒకటో తరగతిలో నమోదై పదో తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువు పూర్తి చేసుకుంటున్నారు. పేద, మధ్య తరగతి, ధనిక అనే బేధం లేకుండా అన్నివర్గాల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంపై మోజుతో తమ పిల్లలకు మూడేళ్లు నిండకముందే ప్రైవేట్ బడుల్లో నమోదు చేసేందుకు ఆకస్తి చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య, ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో పాటు గ్రామీణులు సైతం ఫీజులు భారమైనా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్ర వేశం పొందే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతున్నది. దీని ప్రభావం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కుదింపు, సమీప బడుల్లో విలీనం, ఉపాధ్యాయ పోస్టులపై పడుతున్నది. ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి ఐదేళ్లు నిండిన చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు కసరత్తు చేసినా ఆశించిన మేరకు ఫలితాలు రావడంలేదు. అంగన్వాడీల్లో నమోదయ్యే 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలు, కృత్యాలతో ఆంగ్ల అక్షరాలను నేర్పించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను పూర్తి చేయించి అదే ప్రాంగణంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆటపాటలతో ఆంగ్ల అక్షరాలతో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేయనున్నది.