ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
ఇక ఆక్సిజన్‌కు కొరత ఉండదు
జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ హమీద్
జనగామ చౌరస్తా, అక్టోబర్ 7 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన పీఎస్ఏ (ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆన్లైన్లో గురువారం ఉదయం ప్రాంభించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల (వందపడకల)లో పీఎం కేర్, తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఒక నిమిషానికి 500 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్‌ను సుమారు రూ. 1 కోటి వ్యయంతో ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ కొరతకు ఇక సమస్య ఉండదని వారు పేర్కొన్నారు. కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ పీ సుగుణాకర్‌రాజు, జనగామ మున్సిపల్ చైర్మన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె విజయ, స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వంగాల కల్యాణి, ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, సిద్ధిలింగం, వంగాల మల్లారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖజా శరీఫ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.