నర్మెట, సెప్టెంబర్ 6 : జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో అత్యవసర వైద్య సేవలందించాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. నర్మెట మండలంలోని అమ్మాపురం-వెల్దండ గ్రామాల మధ్య హరితహారం నిర్వహించి, మొక్కలు నాటారు. అదేవిధంగా నర్మెట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని అన్నారు. పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు గుంపుగుంపులుగా ఉండడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దవాఖానలో ఎన్ని ప్రసవాలు చేశారని వైద్యాధికారి మోజెస్రాజ్ను అడిగి తెలుసుకున్నారు. కనీసం లేబర్ రూం కూడా అందుబాటులో లేకపోతే ఎలా అత్యవసర సేవలు అందిస్తారని ప్రశ్నించారు. స్టాఫ్‌నర్సు లేక సాధారణ ప్రసవాలు చేయడం లేదని వైద్యాధికారి చెప్పడంతో మీరు ఎందుకు ఉన్నారని కలెక్టర్ పశ్నించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఇలాగే ఉందా, అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయా అని డీఎంహెచ్‌వో మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంతమందికి టీకాలు వేశారని అక్కరాజుపల్లి ఎఎన్‌ఎంను అడిగారు. సరిగా సమాధానం చెప్పకపోవడంతో రోజు గ్రామానికి వెళ్తున్నారా లేదా అని ప్రశ్నించారు. అక్కరాజుపల్లిని సందర్శించినప్పుడు ఎన్ని రోజులకు ఊరికి వస్తారోనని గ్రామస్తులను అడిగి తెలుసుకుంటానని చెప్పారు. దవాఖానలో సిబ్బంది గైర్హాజరు కావడంతో ఎందుకు సెలవులు మంజూరు చేశారని వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం హన్మంతాపూర్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులను తిరిగి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని అన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో ఖాజనయీమొద్దీన్, ఎంపీవో గపూర్, ఏపీవో రమాదేవి, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
తహసీల్దార్ కార్యాలయం తనిఖీ
బచ్చన్నపేట : తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శివలింగయ్య తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రిజిస్టేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహస్తే సహించేదిలేదని, ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, హమీద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, డీఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ శైలజ, ఎంపీడీఓ ఖాజామొహినుద్దీన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.