జనగామ, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : దేవాదుల నీటి విడుదలలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు మల్లన్నసాగర్ నుంచి జనగామ నియోజకవర్గ రైతాంగానికి నిరాటంకంగా సాగునీరు అందించే బృహత్తర పథకానికి ముఖ్యమం త్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సోమవారం జన గామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా జనగామ మున్సిపల్, రూరల్‌కు చెందిన లబ్ధిదారులకు రూ.97 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ముత్తిరెడ్డి ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న జనగామ ప్రాంతంలో సాగు, తాగునీటి ఎద్దడి ఉండేదన్నారు. నాయకులు గ్రామాలకు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, ఒకవేళ వచ్చినా తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితులుండేవన్నారు. ఇప్పడు ఇంటింటికీ తాగునీరు, రెండు పంటలకు సాగునీరు అందుతున్నదని ముత్తిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం విడుదలవుతున్న దేవాదుల నీటిని పైనుంచి కింద వరకు వచ్చే సరికి సరిపోవడంలేదన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తేవడంతో మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు అందించేందుకు రూ.380 కోట్ల ప్రతిపాదనలకు ప్రాథమికంగా ఆమోదించారని తెలిపారు. మల్లన్నసాగర్ నీటితో జనగామ ప్రాంతంలో శాశ్వతంగా సాగునీటి సమస్య తీరిపోతుందని, ఇది వచ్చే ఎన్నికల నాటికి కార్యరూపం దాల్చబోతున్నదని ముత్తిరెడ్డి స్వష్టం చేశారు. ఒకప్పుడు జిల్లాలో బోర్లు పడక రైతులు అప్పుల పాలయ్యారని, తెలంగాణ వచ్చాక ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, ప్రతి చెరువు, కుంటను నింపుకొని రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామన్నారు.
బ్రహ్మండంగా కలెక్టరేట్ నిర్మాణం
కొత్తగా సాధించుకున్న జనగామకు జిల్లా ఆకృతి తెచ్చి పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే బ్రహ్మండంగా కొత్త కలెక్టరేట్, మోడల్ మార్కెట్ యార్డు నిర్మాణం జరుగుతున్నదని, నెహ్రుపార్కు నుంచి హైదరాబాద్ రోడ్డు 60 ఫీట్ల విస్తరణ జరుగుతున్నదన్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే యజమానులు తప్పనిసరిగా రోడ్డు సెట్‌బ్యాక్ నిబంధనలను పాటించడం ద్వారా జనగామ సుందరీకరణ, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పట్టణంలో మురుగునీటి సమస్య తీర్చేందుకు పట్టాదారులు, భూస్వాములు, యజమానులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్క జనగామ మండలంలోనే ఇప్పటి వరకు రూ.15 కోట్లకు పైగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ధి జగిందని, మొత్తం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.80 కోట్ల మేరకు ఆడబిడ్డలకు సాయం అందించామని చెప్పారు. అన్ని జిల్లాల కంటే జనగామ కలెక్టరేట్ నిర్మాణం బాగుందని సీఎస్ ప్రశంసించారని చెప్పారు.
బస్టాం డ్ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు వరకు రోడ్డు విస్తరించిన ఫలితంగా వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయని వివరించారు. జనగామలో ఏ మేరకు పంటలు పండుతున్నాయో..పచ్చదనం ఎట్లా ఉందో ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో చిలకపచ్చ చీటకోడూరు శీర్షికతో మెయిన్‌లో వచ్చిన ఫొటో కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి స్వయంగా తన వద్ద ప్రస్తావించారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జీవన్ ధార పేరుతో ఇంటింటికీ మంచినీటి పథకాన్ని ప్రధానమంత్రి ప్రకటించడానికి కారణం మిషన్ భగీరథ పథకం స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు స్వరూప, సమద్, దేవరాయి నాగరాజు, నాయకులు బాల్దె సిద్ధిలింగం, శారద, శ్రీశైలం, బైరగోని యాదగిరిగౌడ్, గిరబోయిన అంజయ్య, చంద్రారెడ్డి, దేవునూరి సతీశ్ పాల్గొన్నారు.