అగ్రంపహాడ్ జాతరలో ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆత్మకూరు ఎస్సై జీ దుర్గాప్రసాద్ సస్సెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమవారిని అకారణంగా కొట్టిన ఎస్సైపై వేటు పడడంతో బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 23న ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క జాతరను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవార్ల దర్శనానికి వెళ్లిన సందర్భంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకున్నా రెండు రోజుల అనంతరం ఈనెల 25న ఎస్సై దుర్గా ప్రసాద్ బీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటనలో బాధితులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ, డీసీపీ అబ్దుల్ బారితో దర్యాప్తునకు ఆదేశించారు. పలువురు బాధితులను కమిషనరేట్‌కు పిలిపించి విచారించిన డీసీపీ, నివేదికను సీపీకి అందించారు. దీని ఆధారంగా ఎస్సై దుర్గా ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
జై తెలంగాణ అన్నందుకు అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో జై తెలంగాణ నినాదమే గెలిచింది. నేడు ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నాం. అక్రమంగా ఏది చేసినా నడుస్తది అనుకునే పోలీసులకు సీపీ నిర్ణయం ఒక హెచ్చరిక లాంటిది. పోలీసులు న్యాయం పక్షాన, ప్రజల పక్షాన నిలవాలి. ప్రజలకు భరోసా కల్పించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అన్ని వర్గాల వారిని, రాజకీయ పార్టీల ప్రతినిధులను సమానంగా చూడాలి. రాజకీయ ఒత్తిడులను తట్టుకుని నిలవాలి. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గితే సమస్యలు తప్పవు. అగ్రంపహాడ్ ఘటనలో పారదర్శకంగా విచారణ చేపట్టి న్యాయం పక్షాన నిలిచిన వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝాకు కృతజ్ఞతలు. మరింత లోతుగా విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులనూ శిక్షించాలి. ఎస్సైని సస్పెండ్ చేస్తూ సీపీ తీసుకున్న నిర్ణయం ప్రజలకు భరోసా కల్పించింది.
బీఆర్ఎస్ నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై 24గంటల్లో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేశ్ సీపీని కోరారు. 24గంటల్లో చర్యలు తీసుకోకపోతే 28న ‘చలో ఆత్మకూరు’ పేరిట పోలీస్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఎస్సై ప్రసాద్‌పై వేటు పడినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఏడుగురి పేర్లతోనే కానిస్టేబుల్ రమేశ్ ఫిర్యాదు నమోదు చేసి అదనంగా మరో ఆరుగురి పేర్లు కలిపినట్లు సమాచారం. కాంతాల కేశవరెడ్డి, ఆవుల శ్రీనివాస్, మోరె మహేందర్, రేవూరి సుధాకర్‌రెడ్డి, నేరెళ్ల కమలాకర్, ఎండీ జాకీర్‌అలీ, కూస కుమారస్వామిపై ఫిర్యాదు నమోదు కాగా మరో ఆరుగురు సాంబశివరెడ్డి, రేగుల కిశోర్, కాంతాల రవీందర్‌రెడ్డి, వేల్పుల గణేశ్, సిలువేరు రాజు, శ్రీధర్‌రెడ్డి పేర్లను కలిపారు. వీరిలో 10 మందిని స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. హనుమకొండలో ఉన్న టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేరుతో బట్టలు ఊడదీసి బూతులు తిడుతూ విచక్షణా రహితంగా దాడిచేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు సిలువే రు రాజు, మోరె మహేందర్, శ్రీధర్‌రెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులు తమ ఇష్టారీతిన బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టార ని రేవూరి సుధాకర్‌రెడ్డి, జాకీర్‌అలీ, కాంతాల కేశవరెడ్డి, వంచ సాంబశివరె డ్డి అంటున్నారు. ఇలా పేర్లు నమోదు చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని చెబుతున్నారు. జాతరలో ఏమీ జరగకపోయినా కేవలం నినాదాలు చేశారన్న కారణంతో అరెస్ట్ చేసి లాక్కెళ్లి కొట్టడం చూస్తే ఇదంతా అధికార పార్టీ నాయకులు, పోలీసులు కలిసి అడిన నాటకమని విమర్శి స్తున్నారు. జాతర ప్రాంగణంలో గేటు వద్ద ‘జై కాంగ్రెస్’, ‘రేవూరి ప్రకాశ్రె డ్డి నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ కాంగ్రెస్ నాయకులు నినదించారని ‘మీ పార్టీతో ఏమవుతుంది’ అని హేళన చేస్తూ రెచ్చగెట్టారని, వారిపై కేసు లు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తమవారిని కొట్టిన ఎస్సై సస్పెండ్ కావడంతో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన13 మంది బీఆర్ఎస్ నాయకుల కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.