జనగామ చౌరస్తా, అక్టోబర్ 29 : జనగామలోని చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్యలో నాలుగెకరాల భూమి కొనుగోలులో నిధుల గోల్మాల్ జరిగింది నిజమేనని తేలింది. అదనపు కలెక్టర్ విచారణలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నెల 25న ‘మహిళా సమాఖ్యలో నిధుల గోల్మాల్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ కలెక్టరేట్లో డీఆర్డీవో వసంతతో కలిసి జిల్లా సమాఖ్యలోని 36 మంది ప్రతినిధులతో విచారణ చేపట్టగా ఈ విషయం బయటపడింది.
జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో సమాఖ్య పేరిట కొనుగోలు చేసిన భూమికి బహిరంగ మార్కెట్లో రూ.40 లక్షలు మాత్రమే ధర ఉందని ఇటీవల తహసీల్దార్ నివేదిక అందజేశారు. దీని ఆధారంగా అదనపు కలెక్టర్ ఆరా తీయగా సమా ఖ్య బాధ్యులు ఎకరానికి రూ. 58.75 లక్షల చొప్పున మొత్తం నాలుగెకరాలకు రూ. 2.35 కోట్లు భూ యజమాని కందగట్ల అశోక్‌కు చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఎకరానికి రూ.18.75 లక్షల చొప్పున మొత్తం రూ.75 లక్షల గోల్మాల్ జరిగినట్లు ఆయన గుర్తించారు. అంతేకాకుండా సదరు అశోక్‌కు సమాఖ్య బాధ్యులు 21 మంది ఇతరుల పేరిట చెక్కులు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
భూమిని అధిక రేటుకు విక్రయించడం తో పాటు 21 మంది పేరిట చెక్కులు తీసుకున్న అంశంపై యజమాని అశోక్‌ను అదనపు కలెక్టర్ గట్టిగా ప్రశ్నించారు. దీంతో 15 రోజుల్లోగా అగ్రిమెంట్‌ను రద్దు చేసుకొని రూ.2.35 కోట్లు తిరిగి సమాఖ్యకు చెల్లిస్తానని అశోక్ హామీ ఇచ్చారు. ఈ మేరకు స మాఖ్య బాధ్యులు సైతం ఈ విషయమై ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కాగా, ఇం దుకు బాధ్యులైన పలువురు అధికారులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సమాఖ్య బాధ్యులు, భూ యజమానిపై కేసులు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.