సుబేదారి, జూన్ 7 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి కాజీపేట సబ్ డివిజన్ నగర శివారు సమీప ప్రాంతంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ తన ఇంటి వద్ద సెటిల్మెంట్లకు తెరలేపాడు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన సదరు అధికారి విధులను గాలికి వదిలేసి, ఇంటి వద్ద అనధికారికంగా విధులు నిర్వరిస్తూ సెటిల్మెంట్లుకు పాల్పడుతున్నాడు. బాధితులు వారి సమస్యల పరిష్కారం కోసం ఠాణాకు వస్తే అందుబాటులో ఉండకుండా, సిబ్బందితో ఇంటికి పిలుపించుకొని సెటిల్మెంట్లకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతున్నది. ఆ ఠాణాలో పరిధిలో ఎక్కువగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, మూఢ నమ్మకాల వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి.
ఈ కేసులకు సంబంధించి సదరు అధికారిని బాధితులు ఆశ్రయిస్తే న్యాయం జరగకపోగా, లం చం ఇచ్చిన వారికే న్యాయం జరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి సెటిల్మెంట్లపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో పలు కేసుల్లో పెద్దమొత్తంలో డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఆరు నెలల క్రితం డబ్బులు వస్తాయని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పూజారులు ఆ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని, రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన ఘటనలో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినా, ఈ విషయం బయటికి పొక్కకుండా నిందితులను నుంచి సదరు అధికారి పెద్దమొత్తంలో డబ్బు లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యవసాయ భూములు పక్కప్కనే ఉన్న ఇద్దరు రైతుల మధ్య రెండు ఎకరాల భూమి విషయంలో వివాదం జరుగుతున్నది.
దీనిపై పట్టా పాస్‌బుక్‌లు, రెవెన్యూ రికార్టు ఆధారంతో అసలైనా బాధితుడు కొద్ది రోజుల క్రితం న్యాయం చేయాలని సదరు ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశాడు. న్యాయం చేస్తానని బాధితుడిని, ఆ గ్రామ సర్పంచ్ ద్వారా ఇంటికి పిలుపించుకుని సర్పం చ్ ద్వారా రూ.లక్ష, మరో మధ్యవర్తి ద్వారా మరో రూ.లక్ష మొత్తం రెండు లక్షలు తీసుకున్నాడు. అలాగే ఎదుటి పార్టీ వ్యక్తి వద్ద కూడా పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని అసలైనా బాధితుడుకి న్యాయం చేయకుండా నాన్చుతూ, చివరికి ఎదుటి పార్టీ వ్యక్తికి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయాలని ఫిర్యాదుదారుడిని సదరు ఇన్స్పెక్టర్ తనదైన ైస్టెల్లో బెదిరించడంతో బాధితుడు కంగు తిన్నా డు.
ఇందేదని అడిగితే అంతే.. లేదంటే కోర్టు లో చూసుకో.. అని ఆ సీఐ చేతు లు ఎత్తేశాడు. ఆ ఇన్స్పెక్టర్ పనిచేసే ప్రాంతం లో భూముల రేట్లు పెరిగిపోవడం, భూ వివాదాలు కొనసాగుతున్నందు న, ఆ సీఐ ప్రత్యేక దృష్టి పెట్టి, పోస్టింగ్‌లో ఉన్నపుడే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జోక్యం చేసుకొని సెటిల్మెంట్లుకు పాల్పడుతున్నాడు. సదరు ఇన్స్పెక్టర్ పనిచేసే రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల రెండు దఫాల్లో 15 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోగా కేవలం నాలుగింటిపైనే కేసు నమోదు చేసి మిగతా వాటిని వదిలిపెట్టడంలో అతని పాత్ర ఉన్నట్లు తెలిసింది.