ధర్మసాగర్/పాలకుర్తి, మార్చి 27: దేవాదుల ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న పనులకు త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట పంపుహౌస్, ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ పనులు పరిశీలించారు. దేవాదుల పంపుహౌస్ వద్ద పైప్‌లైన్ నిర్వహణ ఎలా ఉంది, సాగునీరు ఏఏ ప్రాంతాలకు వెళ్తుందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మోటార్లు నడిచే విధానంపై పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధుల మంజూరు చేసేందుకే కేంద్ర జల మంత్రిత్వశాఖ నుంచి వచ్చారని సమాచారం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కేంద్ర జల శక్తి మంత్రత్వశాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ సింగ్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, ఈఎన్సీ జనరల్ రమేశ్‌బాబు, చీఫ్ ఇంజినీర్ సుధీర్, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈలు సీతారామ్, మంగీలాల్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ సదానందం పాల్గొన్నారు.
దేవాదుల రిజర్వాయర్ల పనుల్లో వేగం పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం నష్కల్ రిజర్వాయర్, పాలకుర్తి మండల కేంద్రంలోని రిజర్వాయర్, లింగాలఘనపురం మండలం నవాబ్‌పేట రిజర్వాయర్లను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి పరిశీలించారు. కాంతారావు మాట్లాడుతూ రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తయితే సాగునీటి వసతి మెరుగవుతుందన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ ముందు భాగంలో 0 నుంచి 1.3 కిలోమీటర్ వరకు కట్ట పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.
తూము నుంచి దుబ్బతండా వరకు 2.4 నుంచి 3.385 వరకు కట్ట పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పాలకుర్తి – హనుమకొండ రూట్లో రోడ్డు మునుగుతున్నందున ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం చేపట్టాలని ఆయన ఆదేశించారు. రెండు రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించి ప్రతి రోజు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట ఈఎన్సీ రమేశ్‌బాబు, సీఈ సుధీర్, ఎస్ఈ సీతారాం నాయక్ ,ఈఈ ప్రవీణ్, డీఈ శ్రీకాంత్ శర్మ, ఆర్ఎన్ఆర్ కమిషనర్ నాయుడు ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ ఎస్ సరస్వతి ఉన్నారు.