వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : వరంగల్ నగరంలోని బంగారం వ్యాపారాన్ని కుదిపేస్తున్న నకిలీ హాల్మార్క్ ముద్రల వ్యవహారం పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బంగారు ఆభరణాల తయారీదారులు తప్పని సరిగా హాల్మార్క్ ముద్రలు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనతో హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకులు కొందరు మోసాలకు పాల్పడుతున్న విషయంపై వివరాలు సేకరిస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలో అవసరానికి మించి హాల్మార్క్ సెంటర్లు ఏర్పాటు కావడాన్ని పరిగణలోకి తీసుకొని మరింత లోతుగా అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. హాల్మార్క్ సెంటర్లు పాటించాల్సిన నిబంధనలు, అవసరానికి మించి సెంటర్లు ఏర్పాటు కావడం, వాటి నిర్వాహకుల తీరు, పరీక్షల నిర్వహణపై కూ డా సమాచారాన్ని సేకరిస్తున్నారు.
హాల్మా ర్క్ సెంటర్లలోనే ఇతరత్రా వ్యాపార లావాదేవీలు నిర్వహించడంపై కూపీ లాగుతున్నారు. నిబంధనలు అతిక్రమించి వేసిన హాల్మార్క్ ముద్రలు, నాణ్యతా ప్రమాణాల్లో వచ్చిన మార్పులపై వివాదాలు, పోలీస్ స్టేషన్ వరకు చేరిన గొడవలు, మధ్యవర్తిత్వం చేసిన బడా వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు.