జయశంకర్ భూపాలపల్లి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : అధికారుల అలసత్వమో, లబ్ధిదారుల అనాసక్తతో కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆర్భాటం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. ఈ పథకం అమలుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా మారుతుండగా.. 600 స్కేర్ ఫీట్లలోపే గృహాలు నిర్మించుకోవాలనడంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొన్నది. ఫలితంగా ఇండ్ల నిర్మాణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. దీనికి తోడు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనర్హులను జాబితాలో చేర్చారని.. అర్హులకు మొండిచేయి చూపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా స్థలం ఉన్న వారికే ఇండ్లు కేటాయించడంతో జాగా లేని నిరుపేదల సొంతింటి కల.. కలగానే మిగిలిపోనున్నది.
భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఫేజ్ 1, 2 కింద మొత్తం 4,789 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు ఫేజుల్లో 3,046, మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఫేజ్ 1లో 1,733 ఇండ్లు కేటాయించింది. ఇందులో 187 గృహాలకు గ్రౌండింగ్ జరగగా కేవలం 76 ఇండ్లు బేస్మెంట్, 12 స్లాబ్ లెవల్లో ఉండగా మూడు మాత్రం స్లాబ్ పూర్తి చేసుకున్నాయి. బేస్మెంట్ స్థాయిలో రూ. లక్ష, స్లాబ్ లెవల్లో రూ. లక్ష, స్లాబ్ వేస్తే రూ. 2 లక్షలు, ఇల్లు పూర్తయితే మిగిలిన డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే మొత్తం ఇండ్లలో కేవలం 91 మాత్రమే నిర్మాణంలో ఉండగా, చాలా వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు.
అయితే ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలే అడ్డుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 600 స్కేర్ ఫీట్లలోపే ఇండ్లు ఎలా నిర్మించుకుంటారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే చాలా మంది ఇందిరమ్మ ఇండ్లపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. కాగా, భూపాలపల్లి నియోజకవర్గంలోని లింగాల, రాంపూర్, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మంథని నియోజకవర్గంలోని ఎల్కేశ్వరంలో మాత్రమే ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. మంథని నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఇంకా ఫేజ్ 2 ఇండ్లు మంజూరు కాలేదు. అయితే ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఇష్టారాజ్యం, పాలకుల పట్టింపులేని తనమే ఆలస్యానికి కారణమని ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం భూపాలపల్లి పట్టణంలో 544 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేసింది. అనంతరం మరో 416 ఇండ్లను సైతం నిర్మించి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందులో కొంత మందికి పట్టాలు అందజేసింది. ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన వారికి ఇవ్వలేకపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా జాప్యం చేస్తున్నది. దీంతో ఈ ఇండ్లలోని తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రి చోరీకి గురవుతున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు. భూపాలపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు 960 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 126 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి వాటి నిర్మాణాలను మాత్రం గాలికి వదిలేసిందనే చర్చ జోరుగా సాగుతున్నది.