వరంగల్, సెప్టెంబర్ 13 ; ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులు ఊగిసలాడుతున్నారు. పనులు ప్రారంభించాలా? వద్దా అనే మీమాంసలో పడిపోయారు. మొదలు పెడితే అప్పుల పాలవుతామేమో అనే ఆందోళన.. పనులు చేపట్టకపోతే ఇల్లు రద్దవుతుందేమోననే భయంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో గ్రేటర్ వరంగల్‌లో ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. దీనికి తోడు మంజూరు పత్రాలిచ్చిన ఇండ్లలో ఇప్పటి వరకు సగం కూడా ప్రారంభం కాలేదు. ధైర్యం చేసి పనులు చేపట్టిన వారిలో సగం మందికి కూడా బిల్లులు రాలేదు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారగా.. మరోపక్క మొదటి బిల్లు కూడా రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో మిగతా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. పైగా పనులు ప్రారంభించకుంటే మంజూరైన ఇండ్లు రద్దు చేస్తామంటూ అధికారులు నోటీసులిచ్చినా పట్టించుకోవడం లేదు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలే అడ్డంకిగా మారుతున్నాయి. 400 నుంచి 600 ఎస్ఎఫ్టీలోపు మాత్రమే నిర్మాణం చేపట్టాలనే నిబంధనతో చాలా మంది లబ్ధిదారులు పనులు మొదలు పెట్టేందుకు ముందుకు రావ డం లేదు. పాత ఇండ్లు వారసత్వంగా పొందిన వారిలో ఒకరికి మంజూరై మరొకరికి రాకపోవడం కూడా సమస్యలకు దారితీస్తున్నది. ఇవి కాకుండా రూ. 5 లక్షల్లో ఇంటి నిర్మా ణం పూర్తికాదని, అప్పుచేసి పెద్దగా కట్టుకుందామంటే నిబంధనలు అడ్డుపడుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. మళ్లీ బిల్లులు వస్తాయో, రావో అనుమానాలు పెరుగుతుండడంతో అనేక ఇళ్ల నిర్మాణాలపై ఊగిసలాడుతున్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబూబ్ల్యంపీ) పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గోస పడుతున్నారు. ఇల్లు మంజూరైందని సంబురం కన్నా ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలతో నిర్మాణం పూర్తికాక అప్పులపాలవుతామనే ఆందోళన వారిలో నెలకొన్నది. దీంతో పనులు ప్రారంభించాలా? వద్దా? అనే ఊగిసలాడుతున్నారు. ఈ క్రమంలో సగం మందికి పైగా నిర్మాణాలు మొదలు పెట్టకపోవడంతో వెంటనే ముగ్గులు పోసుకోవాలని, లేదంటే ఇండ్లు రద్దు చేస్తామని అధికారులు నోటీసులు జారీచేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గ్రేటర్ వరంగల్ పరిధిలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు వర్ధన్నపేటకు చెందిన 13, పరకాలకు చెందిన మూడు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన రెండు గ్రామాలు కలుపుకని మొత్తం 66 డివిజన్లున్నాయి.
వీటిలో మొత్తం 8,734 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఇందులో 5,108 మంది లబ్ధిదారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు మంజూరు ప్రతాలు అందజేశారు. వీరిలో కేవలం 2,206 మంది మాత్రమే ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో కూడా కేవలం 981 ఇండ్లు బేస్మెంట్ లెవల్‌కు చేరుకోగా, 67 రూఫ్ స్థాయి నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. బేస్మెంట్ స్థాయి పూర్తయిన ఇండ్లలో 504 మందికి మొదటి బిల్లు రూ. లక్ష చొప్పున రాగా, ఇంకా 477 మందికి రావాల్సి ఉంది. అలాగే రూఫ్ లెవల్ పూర్తయిన 67 ఇండ్లలో కేవలం ఏడింటికి మాత్రమే బిల్లులు వచ్చాయి. కాగా, గత నెలలో గ్రేటర్లో పర్యటించిన హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ ఆగస్టు 15లోగా ప్రోసీడింగ్స్ ఇచ్చిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించి నెలరోజులు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. అయితే ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇండ్లను రద్దు చేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో అధికారులు నోటీసులు జారీచేస్తున్నారు.