హనుమకొండ, జూలై 9 : ఈ నెల 14వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికులు హెచ్చరించారు. తమను కన్వర్షన్ చేయాలని బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ ఎదుట విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ (టీవీఏసీ) జేఏసీ ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన నేతలు, కార్మికులు ‘ఆర్జిజన్ వద్దురా.. కన్వర్షన్ ముద్దురా..’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు మాట్లాడుతూ ఆర్టిజన్స్ హక్కుల సాధనకు ఈ నెల 14వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయడంవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దగా భారం పడదన్నారు. స్టాండింగ్ ఆర్డర్‌ను వెంటనే రద్దు చేసి కన్వర్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులు, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ మద్దతు తెలపాలని కోరారు. ఆర్టిజన్స్‌గా విరమణ పొందిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడంతో రోదిస్తూ వెళ్తున్నారని అన్నారు.
కన్వర్షన్ సాధించే వరకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఊరుకునేది లేదని, సస్పెండ్ చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే కుటుంబ సభ్యులతో కలిసి విద్యుత్ సంస్థల ఎదుట వంటావార్పు చేపడుతామని, అవసరమైతే రాష్ట్రమంతా అంధకారం చేస్తామని ఈశ్వర్రావు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వజీర్, కో చైర్మన్లు జీ నాగరాజు, వీ నరేందర్, కో కన్వీనర్లు కే వెంకటేశ్, కే కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.