మహదేవపూర్/వాజేడు/తాడ్వాయి, డిసెంబర్ 16 : చలి పులి గజగజ వణికస్తున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా సోమవారం 12 డిగ్రీలుగా నమోదైంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి పంజా విసురుతుండగా పులి సంచారం కలవరపెడుతున్నది. ఉదయం నుంచే మంచు కమ్ముకోవడంతో పొద్దెక్కినా బయటకు వచ్చేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ఇక రాత్రివేళలో చలికి తట్టుకోలేక స్వెట్టర్లు, మాస్కులు, మఫ్లర్లు ధరించినా తగ్గకపోవడంతో చలిమంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. కాగా చలి తీవ్రత కారణంగా చిన్నారులు, పెద్దలు జలుబు, శ్వాససంబంధ సమస్యలతో పాటు జ్వరంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాడ్వాయి మండలంలోని నర్సాపురం సమీపంలోని కట్ నర్సాపురం వాగులో పులి సంచరించిన ఆనవాళ్లు లభించాయి. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీశాఖ రేంజ్ అధికారి కోట సత్తయ్య వాగు వద్దకు వెళ్లి పాదముద్రలను పరిశీలించి పులివేనని నిర్ధారించారు. ఇతర జిల్లాలకు పులి వెళ్లిందని భావించినా తాడ్వాయి అడవుల్లోనే సంచరిస్తున్నదని తెలిపారు. వాగులో నుంచి పులి లింగాల ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. గ్రామానికి అతి సమీపంలోని వాగులో పులి పాదముద్రలు ఉండడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.