ములుగు, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : హనుమకొండ నుంచి ములుగు వైపు బస్సు ట్రిప్పులను పెంచుతామని ఆర్టీసీ వరంగల్-2 డిపో మేనేజర్ జోత్స్న తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘ములుగు చేరేదెప్పుడో..? కథనం ప్రచురితమవగా ఆమె స్పందించారు. ఈ మేరకు ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. హనుమకొండ నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు సరిపడా బస్సు సర్వీసులు నడిపిస్తామన్నారు. ఇప్పటికే అనుకున్న మేర సర్వీసులు కొనసాగుతున్నాయని, పండుగ, సెలవు రోజుల్లో రద్దీ పెరిగినందున సమస్య ఏర్పడుతున్నట్లు చెప్పారు. రాత్రి 7గంటల నుంచి అర గంటకు ఒకటి చొప్పున ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తున్నాయని, మరిన్ని బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తామని తెలిపారు. అలాగే డయల్ యువర్ డీఎంకు తొమ్మిది మంది ప్రయాణికులు ఫోన్ చేసి సమస్యలను వివరించారన్నారు. ఇందులో కేశవాపురం మీదుగా పరకాలకు బస్సు ట్రిప్పులను పెంచాలని, మంగపేటకు సాయంత్రం వేళలో బస్సును నడిపించాలని, పొట్లాపూర్కు బస్సు ట్రిప్పులను పెంచాలని, మల్లంపల్లికి షెటిల్ బస్సులను నడపాలని ప్రయాణికులు కోరారన్నారు. వీటన్నింటిని పరిశీలిస్తామని తెలిపారు.
ములుగురూరల్, సెప్టెంబర్ 24 : రామప్ప దేవాలయంతో పాటు ఉపాలయాల వద్ద భద్రతా సిబ్బందిని నియమిస్తామని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న గొల్ల గుడి వద్ద తవ్వకాలు చేపట్టి ఆలయ మండపం మధ్యలో అలంకరించిన తామర మొగ్గను ధ్వంసం చేశారు. వాస్తు శిల్పం దెబ్బతిని నేలపై పడి ఉండగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 23న కలెక్టర్ సందర్శించి ఆలయ భద్రతకు పలు అంశాలు సూచించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలయాల వద్ద నిరంతరం భద్రతా సిబ్బందిని నియమించి చుట్టూ సోలార్ లైట్లను అమర్చి సీసీ కెమెరాలతో పరిరక్షణ చర్యలు చేపడుతామన్నారు.