సుబేదారి, మే 9 : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన వరంగల్ కమిషనరేట్ పోలీసులు నేపాలీలపై దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? ఎంతమంది కుటుంబాలతో వచ్చారు? ఒంటరిగా ఉంటున్న వారెందరు? ఏయే పనులు చేస్తున్నారు? అనే వివరాలను ఆరా తీసే పనిలో పడ్డారు.
రంగంలోకి లోకల్ పోలీసులు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ ఆదేశాలతో అలర్ట్ అయిన కమిషనరేట్ అధికారులు లోకల్ పోలీసులతో నేపాలీలపై నిఘా పెట్టారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నేపాలీలు ఎక్కడ నివాసం ఉంటున్నారు? ఎవరెవరి వద్ద, ఏమేం పనులు చేస్తున్నారు? అనేవి ఆరాతీస్తున్నారు. ప్రధానంగా వరంగల్ నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు, కార్మికులంతా నేపాలీలే. సుమారు 200పైగా కుటుంబాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇళ్లల్లో పని మనుషులుగా, దినసరి కూలీలుగా పనిచేసే వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఉపాధి కోసమే ఇక్కడి వచ్చారా? ఇంకేమైనా పనులు చేస్తున్నారా? వారిపై కేసులేమైనా ఉన్నాయా? కుటుంబ నేపథ్యం ఏమిటి? అనే వివరాలు సేకరిస్తుండడంతో పాటు వారి కదలికలను కనిపెడుతున్నారు. నేపాలీలకు అద్దె ఇళ్లు ఇచ్చిన యజమానులను అప్రమత్తం చేస్తున్నారు.
వరంగల్ మీదుగా వెళ్లారా?
రిటైర్ట్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన అనంతరం మహిళ, మరో ఇద్దరితో కూడిన నేపాల్ గ్యాంగ్ ముందస్తు ప్లాన్ ప్రకారం హత్య రైలులో వరంగల్ మీదుగా పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాజీపేట, వరంగల్ రైల్వే పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్ ఘటనతో వరంగల్లో ఏన్నో ఏళ్లుగా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న నేపాలీలు తమ పరిస్థితి ఏమిటనే దానిపై భయాందోళన చెందుతున్నారు. కాగా, నేపాలీలతో జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి.