హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయకుండానే లక్షలాది రూపాయల ఫెలోషిప్ నిధులను స్వాహా చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేయూలో ఈ అక్రమదందా పతాకస్థాయికి చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో పరిశోధకులకు పీహెచ్డీ, పీడీఎఫ్ స్థాయి పరిశోధనలు భారంగా మారొద్దని యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ వంటి సంస్థలు ఇస్తున్న ఫెలోషిప్‌లు పకదారి పడుతున్నాయి.
ఏటా వందలాది మంది ఈ ఫెలోషిప్‌నకు ఎంపికవుతున్నా, కేవలం పదుల సంఖ్యలోనే పరిశోధకులు తమ పరిశోధనను పూర్తి చేస్తున్నారు. ఫెలోషిప్ పొందేవారు ఎలాంటి ఉద్యోగం చేయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ కొందరు మరో ఉద్యోగం చేస్తూ రెండు రకాల ఆదాయం పొందుతున్నారు. మరికొందరు ఫెలోషిప్ డబ్బులను రీసెర్చ్ మీద ఖర్చు చేయకుండా ప్లాట్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఓ వైపు ఫెలోషిప్‌లు క్లెయిమ్ చేస్తూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం చేసిన ఇద్దరు పరిశోధకుల వ్యవహారం ఇటీవల కేయూ తెలుగు విభాగంలో వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్య పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్(పీడీఎఫ్) తీసుకుంటూనే పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్‌గా జీతం తీసుకున్నాడు. యూజీసీ నిబంధనల ప్రకారం పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ తీసుకుంటూ ఇతర ఉద్యోగం చేయడానికి వీలు లేదు.. కానీ, శంకరయ్య లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే ఫెలోషిప్, కాంటిజెన్సీ, హెచ్ఎస్ఏ కలిపి రూ.6,89,400 డ్రా చేశారు.
అదే సమయంలో పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ రూ.2,32,145 వరకు తీసుకున్నాడు. గుట్టుగా సాగిన ఈ వ్యవహారం కొన్నాళ్ల క్రితం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ నిమిత్తం కెమిస్ట్రీ ప్రొఫెసర్ హనుమంతు చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. విచారణలో శంకరయ్య రూ.6,89,400 ఫెలోషిప్‌ను అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఆ మొత్తాన్ని తిరిగి యూజీసీకి చెల్లించాలని, అలాగే ఇటు యూనివర్సిటీని అటు యూజీసీని చీట్ చేసిన శంకరయ్యను టర్మినేట్ చేయాలని ఐదు నెలల క్రితమే కమిటీ సిఫార్సు చేసింది. శంకరయ్య వివిధ మార్గాల ద్వారా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఒత్తిడి పెంచడంతో నెల రోజుల క్రితం రిపోర్టును విచారణ కమిటీ రివ్యూ చేయాలని మరోసారి కమిటీకి పంపారు. కానీ, సభ్యులు యూజీసీకి చెల్లించాల్సిన అమౌంట్ తగ్గించలేమని, అది తమ పరిధి కాదని, పాత సిఫార్సులకే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు సమాచారం.
రూ.6,89,400 శంకరయ్య ఇప్పటివరకు చెల్లించపోయినా కేయూ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్ డాక్టర్ రణధీర్‌రెడ్డి కాలేజీ నిధులు రూ.8.50 లక్షలను సొంతానికి వాడుకొని, కొన్నాళ్లకు తిరిగి జమ చేశారు. విషయం బయటపడటంతో కొద్దిరోజుల్లోనే సదరు ప్రిన్సిపాల్‌కు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా టర్మినేట్ చేశారు. కానీ, శంకరయ్య విషయంలో ఏడు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
‘తీగ లాగితే డొంక కదలినట్లు’ ఫెలోషిప్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనపై చర్యలు తీసుకుంటే అక్రమాలకు పాల్పడిన మరో 20 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే శంకరయ్య వీసీ, రిజిస్ట్రార్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తున్నది. అక్రమంగా డ్రా చేసిన యూజీసీ ఫెలోషిప్ నిధులు రూ.6,89,40 0 తిరిగి చెల్లించాలని శంకరయ్యకు రిజిస్ట్రార్ నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
శంకరయ్యను యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీ వెనకేసుకేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఫెలోషిప్ వ్యవహారంతో కేయూను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమా దం ఉందని ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని యూనివర్సిటీల్లో లోతుగా విచారణ చేస్తే ఇలాంటివాళ్ల బండారం బయటపడే అవకాశమున్నదనే చర్చ జరుగుతున్నది. గతంలో రణధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌పై తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాలని విద్యార్థి సంఘాలు నుంచి పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తున్నది. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నిర్లక్ష్యంతో విసుగెత్తిన ఫిర్యాదుదారులు రాష్ట్ర విద్యాకమిషనర్ యోగితారాణా, యూజీసీ చైర్మన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే యూజీసీ విచారణ చేస్తే విస్తుబోయే నిజాలు బయటపడే అవకాశం ఉందని, దీంతో యూజీసీ కేయూను బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది.
అదే జరిగితే యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులకు రూసా ఫండ్స్, ప్రాజెక్టులు ఆగిపోవడమే కాకుండా యూనివర్సిటీ రిపిటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. మంథని శంకరయ్యపై కమిటీ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకొని యూనివర్సిటీ ప్రతిష్ఠను కాపాడాలని వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రంని ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులు, పరిశోధకులు కోరుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ పేరిట చాలా మంది అక్రమాలకు పాల్పడ్డారు. కమిటీ విచారణలో తెలుగు విభాగం కాంట్రాక్టు లెక్చరర్ మంథని శంకరయ్య అక్రమాలు వెలుగు చూడడంతో తనలాగే మరో 20 మంది యూనివర్సిటీలో ఉన్నారని, వాళ్ల పేర్లు బయటపెడతానంటున్నాడు. పకా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. ఎంక్వైరీలోనూ అదే తేలింది. మిగతా వాళ్లపై కూడా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్