కాజీపేట, ఆగస్టు 4 : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) నిర్వహణపై రైల్వే శాఖ పునరాలోచన చేస్తున్నదా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ప్రతిపాదించిన చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) టెండర్ ప్రక్రియకు సంబంధించిన కదలికలు నిలిచిపోవడం వెనుక కొత్త నిర్ణయాలు ఏమైనా ఉన్నా యా? అనే చర్చ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతున్నది. రూ. 680 కోట్ల వ్యయంతో ఆర్ఎంయూ నిర్మాణ పనులు చేపట్టగా చివరి దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యం లో ఇటీవల దీనిని సందర్శించిన రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్ ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు, టెండర్ ప్రక్రియను చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించామని, వారి ఆ ధ్వర్యంలో ప్రైవేట్ భాగస్వామ్యంతోనే నిర్వహించనున్నామ ని, జూలైలో టెండర్ పిలుస్తామని చెప్పారు. కాగా, ఆగస్టు నెల ప్రారంభమైనా టెండర్ ప్రక్రియను చెన్నై ఐసీఎఫ్ ఇంత వరకు మొదలు పెట్టకపోవడం, కదలికలు నిలిచిపోవడం వె నుక కొత్త నిర్ణయాలున్నాయనే చర్చ జరుగుతున్నది.స్థానికు ల ఆందోళనలతో ఆర్ఎంయూ ప్రైవేటీకరణ కాకుండా రైల్వేశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే దిశగా కేంద్రం పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశం లభించనుంది.
భూ నిర్వాసితులు, స్థానికులకే అధికశాతం ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్తో పాటు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్న విషయం తె లిసిందే. ఇటీవల న్యూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సైతం నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక నాయకత్వం కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం, పరిసర ప్రాంతం, షెడ్డు నిర్మాణం తదితర వాటిని వీడియోలు, ఫొటోలు సేకరించి రైల్వేశాఖకు పంపించినట్లు చర్చ జరుగుతున్నది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఆర్ఎంయూ నిర్వహించడానికి సిద్ధమైనట్లు ఈ పరిణామాల ద్వారా తెలుస్తున్నది. అయితే రైల్వేశాఖ నిర్ణయం సానుకూలంగా వెలువడితే వరంగల్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుల్లో ఒకటిగా కాజీపేట ఆర్ఎంయూ నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే భూ నిర్వాసితులు, స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయనే ఆశ ఇక్కడి ప్రజల్లో చిగురిస్తున్నది. అలాగే అనుబంధ పరిశ్రమలు, చిన్న వ్యాపారాల ద్వారా ఉపాధి దొరికి ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందనుంది.
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం భూములిచ్చిన నిర్వాసితులు, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. భూములు కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర రైల్వేశాఖ న్యాయం చేయాలి. ఫ్యాక్టరీ ప్రారంభమయ్యేలోపు నిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. వారి ప్రయోజనాలను కాపాడేందుకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.
– దేవులపల్లి రాఘవేందర్, రైల్వే జేఏసీ కన్వీనర్
రైతుల నుంచి భూమిని తీసుకున్నప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నష్టపరిహారం ఇచ్చామని చేతులు దులుపుకోవడం సరికాదు. భూనిర్వాసితులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలి. సమస్యకు పరిష్కారం లభించే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తాం.
– కొండ్ర నర్సింగరావు, రైల్వే జేఏసీ చైర్మన్