నర్సంపేట రూరల్, జూలై 14: సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో జిల్లా దవాఖాన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న జిల్లా ఆస్పత్రి పనులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సంపేట నియోజకవర్గానికి 250 పడకల జిల్లాస్థాయి దవాఖానను రెండేళ్ల క్రితం మంజూరు చేశారన్నారు. లక్షా 65 వేల స్కేర్ ఫీట్లతో సుమారు రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రిని ఏ, బీ, సీ బ్లాకులుగా నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు. మొదట దవాఖానలోని సీ బ్లాక్ (జీ+)ను ప్రారంభించి పాత సీహెచ్‌సీని ఇక్కడకు తరలించి, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మరో రెండు నెలల్లో జిల్లా ఆస్పత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
వీటితోపాటు దవాఖానకు సంబంధించి పలు రకాల సౌకర్యాల (అటెండెంట్, వెయిటింగ్ హాల్ షెడ్, అంతర్గత రోడ్లు, క్యాంటిన్, నర్సరీ) కోసం మరో రూ. 10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. రూ. 30 కోట్ల నిధులతో నర్సంపేటకు అత్యవసర వైద్య సేవల యూనిట్ (క్రిటికల్ కేర్ యూనిట్) మంజూరైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఏకైక మెడికల్ కాలేజీ నర్సంపేట నియోజకవర్గానికి మంజూరు కావడం హర్షించదగిన విషయమన్నారు. మెడికల్ కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా పెద్ది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక నర్సంపేట మెడికల్ హబ్‌గా మారనుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కౌన్సిలర్లు జుర్రు రాజు, శీలం రాంబాబు, గందె చంద్రమౌళి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి వేనుముద్దుల శ్రీధర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, రాయిడి దుష్యంత్‌రెడ్డి, గోనె యువరాజ్, పుట్టపాక కుమారస్వామి, బండి రమేశ్, ఇర్ఫాన్, సతీశ్, గుంటి కిషన్, అధికారులు పాల్గొన్నారు.