జయశంకర్ భూపాలపల్లి, మే 31 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ మహమ్మారి హోంగార్డు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న మామిడాల శంకర్ ఈ నెల 25న తుది శ్వాస విడిచారు. 20 ఏండ్లుగా పోలీస్ శాఖలో హోంగార్డుగా చాలీ చాలని జీతంతో ఆయన సేవలందించారు. అటు ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో ఆరోగ్యశ్రీతో పాటు అప్పులు చేసి చికిత్స పొందినా ఫలితం లేకుండా పోయింది. హోంగార్డు దీన స్థితిని ‘నమస్తే తెలంగాణ’ జనవరి 26న ‘అంపశయ్యపై హోంగార్డు’ అనే కథనం ద్వారా వివరించింది. దీనికి దాతలు స్పందించి సహకారం అందించడంతో శంకర్ వైద్యం చేయించుకున్నారు.
అయినా నయం కాకపోడంతో ఇటీవల మృతి చెందాడు. శంకర్, అతని భార్య విజయలక్ష్మికి నా అన్న వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నది. ప్రభుత్వం, డిపార్ట్మెంట్ చేయూత కోసం చేతులు చాస్తుంది. పూట గడిచేదెలా భూపాలపల్లిలోని రాజీవ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముండే మామిడాల శంకర్ 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో హోంగార్డుగా సేవలందించాడు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేశాడు. ఊహించని విధంగా క్యాన్సర్ మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.
రెండేళ్ల క్రితం శంకర్‌కు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద అవకాశం లేకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందాడు. శంకర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురు లక్ష్మీసువిధ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు లక్ష్మీఅవంతికకు మూడేళ్లు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి ఏంటని బాధితుని భార్య విలపిస్తున్నది. ఎవరూ లేని తాను పిల్లలను ఎలా సాకాలని, ఇప్పటి నుంచి పూట గడిచేదెలా? ఇంటి అద్దె కట్టేదెలా అని విలపిస్తున్నది.
నాకు ఇద్దరు ఆడ పిల్లలు. మాకు వేరే ఆధారం లేదు. మా ఆయనకు తల్లిదండ్రులు, నాకు తల్లిదండ్రులు లేరు. మాకు ఇతర ఆస్తులు లేవు. మా ఆయన హోంగార్డు ఉద్యోగం చేస్తేనే ఇన్నాళ్లు బతికాం. రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ మృతిచెందాడు. చికిత్సలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలి. ఇద్దరు ఆడ పిల్లల పరిస్థితి ఏంటి. ఇం ట్లో పూట గడిచేదెలా. నాకు కుడి చేయి పనిచేయదు.
అన్నం కూడా ఎడమ చేయితో తింటాను. గుండె సమస్య ఉంటే డబ్బులు లేక చికి త్స చేయించుకుంటలేను. ఇప్పటి వరకు పోలీసు అధికారులు మాకు ఎలాంటి సహకారం అందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించం డి. మమ్మల్సి బతికించి ఒక దారి చూపండి. తండ్రి చనిపోతే హాస్టల్ నుంచి నా బిడ్డ ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. తోటి హోంగార్డులు వెయ్యి రూపాయలు పంపిస్తే ఇంటికి వచ్చింది.
– విజయలక్ష్మి, శంకర్ భార్య