కాజీపేట, మార్చి 6 : కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర భారత దేశానికి హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య (07709/07710), చర్లపల్లి-ముజఫర్‌పూర్-చర్లపల్లి మధ్య (07711/07712) పది ట్రిప్పులు నడవనున్నాయి. చర్లపల్లి-దానాపూర్ రైలు ఈ నెల 9, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3.10కి బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
దానాపూర్ నుంచి ఈ నెల 11, 21 తేదీల్లో మధ్యాహ్నం 3.15కు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. మరో రైలు ఈ నెల 10, 15, 20 తేదీల్లో మధ్యాహ్నం 3.10కి చర్లపల్లిలో బయలుదేరి రెండోరోజు రాత్రి 2.00 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 12, 17, 22 తేదీల్లో తెల్లవారుజామున 4.15కు బయలుదేరి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు రెండోరోజు సాయంత్రం 6.00 గంటలకు చేరుకుంటుంది.
చర్లపల్లి-దానాపూర్ రైలు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సీ, పిపరియ, నర్సింగ్‌పూర్, మదన్ మహల్, కట్నీ, మైహార్, సట్నా, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, చోక్కి, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బాక్సర్, ఆగ్రా, స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. అలాగే ముజఫర్‌పూర్ రైలు పైస్టేషన్లతో పాటు దానాపూర్, పాటలీపుత్ర, హజ్జీపూర్లో ఆగుతుందన్నారు. ఈ ప్రత్యేక రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, 3 ఏసీ(ఎకానమి), స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయని, ఉత్తర భారతదేశానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.