హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ నర్సరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అధునాతన హంగులతో జిల్లాకో సమీకృత సెంట్రల్ నర్సరీ ఏర్పాటు చేయనుంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయనుండగా, ఇప్పటికే బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో 5 ఎకరాల అటవీ స్థలాన్ని అధికారులు గుర్తించారు. మౌలిక వసతుల కల్పన, మొక్కల పెంపకం, పర్యవేక్షణకు రాష్ట్ర సర్కారు రూ. 25 లక్షలు మంజూరు చేసింది. తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో అరుదైన మొక్క జాతుల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జనగామ చౌరస్తా, నవంబర్ 3 : పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తెలంగాణ పల్లె, పట్టణాలన్నీ హరితమయం అయ్యాయి. పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, అర్బన్ పార్కు, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుతో ఊళ్ల ల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకనిర్ణయం తీసుకుంది. జిల్లాకో సమీకృత సెంట్రల్ నర్సరీ (హైటెక్) ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా జిల్లాలోని బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో హైటెక్ నర్సరీ ఏర్పాటు చేయడానికి అధికారులు 5 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ప్రభుత్వం వారం కిందట రూ.25 లక్షల నిధులను ‘హరిత నిధి’ నుంచి మం జూరు చేసింది. అతి త్వరలో నర్సరీ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. నర్సరీలో అరుదైన మొక్క లు, దేశీయ అటవీ పండ్ల చెట్లు, వాణిజ్య పండ్ల మొక్కలను పెంచనున్నారు.
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్క లు పెంచే పద్ధతులను అవలంబించనున్నారు. ట్రేలల్లో గింజలు నాటి మొలకెత్తిన తర్వాత బ్యాగుల్లోకి మారుస్తారు. మీటరున్నర నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఉం డే మొక్కలను పెంచేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. హరితహారంతో పాటు ఇతర అరుదైన మొక్కల అవసరాలు తీర్చడానికి ఇది ఉపయోగపడనుంది. జిల్లాలో మొక్క ల కొరత ఉన్న గ్రామ పంచాయతీలకు ఇక్కడి నుండే అవసరమైన మొక్కలను పంపిణీ చేయనున్నారు. దీంతో జీపీలకు సమయంతో పాటు రవాణా ఖర్చులూ తగ్గనున్నాయి. జిల్లాలో అటవీ ప్రాంతం 1.05 శాతం ఉంది. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశాల మేరకు అటవీ ప్రాంతా న్ని 3 శాతం పెంచడానికి జిల్లా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ‘హరిత యాక్షన్ ప్లాన్’ రూపొందించారు. 2024 సంవత్సరం వరకు జిల్లాలో ఉన్న ప్రతి హెక్టారుకు 10 వేల మొక్కల చొప్పున 6,882 హెక్టార్లలో 7 కోట్ల మొక్కలు నాటడానికి ప్లాన్ సిద్ధం చేశారు. దీనికి తోడు జిల్లాలో అరుదైన మొక్కలతో పాటు దేశీయ, వాణిజ్య పండ్ల మొక్కలు, హరితహారం కార్యక్రమానికి అవసరమైన ఇతర మొక్కలను అందించేందుకు ప్రభుత్వం ఇప్పుడు సమీకృత సెంట్ర ల్ నర్సరీ (హైటెక్) ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అతి త్వరలో హైటెక్ నర్సరీ అభివృద్ధి పనులు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రారంభం కానున్నాయి.
రూ.25 లక్షలు మంజూరు..
కొండల్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో హైటెక్ నర్సరీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం వారం కిందట రూ.25 లక్షల నిధులను హరితనిధి నుంచి మంజూరు చేసింది. అతి త్వరలో ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. ఈ హైటెక్ నర్సరీలో హరితహారానికి అవసరమైన మొక్కలతో పాటు ఇతర అరుదైన మొక్కలను నాటుతాం. ముఖ్యంగా తక్కువ స్థలంలో మీటరున్నర నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఉండే వీలైనన్ని ఎక్కువ మొక్కలను పెంచుతాం. జిల్లాలో మొక్కల కొరత ఉన్న ప్రాంతాలకు ఇక్కడి నుంచి పంపిణీ చేస్తాం.