నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వాన కురిసింది. శనివారం ఉదయం మొదలైన ముసురు రాత్రి వరకు కొనసాగింది. కాగా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పలు చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. భారీ వరదకు పంట పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల లోలెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపసముద్రం సరస్సు నీటిమట్టం 21 అడుగులకు, రామప్ప చెరువు 27 అడుగులకు చేరుకుంది. టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగు పొంగి ప్రవహిస్తున్నది. గోవిందరావుపేట మండలం చల్వాయిలో మార్క సారమ్మకు చెందిన పెంకుటిల్లు కూలిపోగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంకటాపురం(నూగూరు) మండలంలోని కంకల, పాత్రాపురం, జిన్నెల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
కాళేశ్వరం/ఏటూరునాగారం/కన్నాయిగూడెం/మంగపేట/వాజేడు/వెంకటాపురం (నూగూరు) : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద 7.50 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. రామన్నగూడెం, రాంనగర్, ఏటూరునాగారం, రొయ్యూరు, ముల్లకట్ట పరిధిలోని వందల ఎకరాల పంట పొలాలు మునిగి పోయాయి. రామన్నగూడెం-ఏటూరునాగారం మధ్యలోని కరకట్ట క్రమంగా కొట్టుకుపోతూ ప్రమాదకరంగా మారండంతో నీటి పారుదలశాఖ అధికారులు ఇసుక బస్తాలు వేశారు.
వాజేడు, గుమ్మడిదొడ్డి బ్రిడ్జి నీటమునగడంతో నాగారం గ్రామం వద్ద రోడ్డుకు అడ్డంగా అధికారులు తాటి దుంగను వేసి రాకపోకలు నిలిపివేశారు. అలాగే టేకులగూడెం రేగుమాగు బ్రిడ్జిపై 10 రోజులుగా వరద నీరు నిలిచి ఉండడంతో తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, సాయంత్రం నుంచి గోదావరి వరద క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదావరి పరీవాహక ప్రాంతాలను ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయతో కలిసి ములుగు ఎస్పీ శబరీష్ సందర్శించి పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.