వరంగల్/నర్సంపేట రూరల్/వాజేడు, అక్టోబర్ 21: వరంగల్ నగరంలో సోమవారం జోరువాన కురిసింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. నగర రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించింది. వరంగల్ చౌరస్తా, అండర్ బ్రిడ్జి ప్రాంతాలతో పాటు హనుమకొండ బస్ స్టేషన్, బాలసముద్రం, కాకాజీ కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి.
పాఠశాలలు, కళాశాలలు వదిలిన సమయంలో ఒక్కసారిగా జోరుగా వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. బ్యాగులు తడువకుండా పరుగులు పెట్టారు. స్కూళ్ల నుంచి పిల్లలను తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు అనుకోకుండా వచ్చిన వానతో ఇబ్బందులు పడ్డారు. నర్సంపేట మండలం మాదన్నపేట, నర్సింగాపురం, ఇటుకాలపల్లి, గురిజాల, ముగ్ధుంపురం, లక్నేపల్లి గ్రామాల్లో వరిపంట నేలవాలింది. ములుగు జిల్లా వాజేడు మండలంలో గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది.