ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 41.9 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్లబెల్లి మండలం అత్యధికంగా 91.8 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 88.6 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 67.4 మిల్లీమీటర్లు, నెక్కొండలో 71.4 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.
అలాగే నర్సంపేటలో 52.6 మిల్లీమీటర్లు, ఖానాపూర్ 54.8 మిల్లీమీటర్లు, రాయపర్తిలో 20.6 మిల్లీమీటర్లు, పర్వతగిరిలో 56.4 మిల్లీమీటర్లు, వరంగల్లో 16.4 మిల్లీమీటర్ల మోస్తారు వర్షపాతం కురిసింది. గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట, ఖిలావరంగల్ మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు ఈ వర్షపాతం సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది.