కాజీపేట, జనవరి 17 : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రైల్వే కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట రైల్వే జంక్షన్ – బల్లార్ష సెక్షన్‌లోని మూడో లైన్ రైళ్లు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మార్గంలో నిత్యం వందలాది గూడ్స్, ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీగా ఉంటోంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలు బల్లార్ష-కాజీపేట రైల్వే జంక్షన్‌కు మూడో లేన్ ఏర్పాటు చేయాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ఈమేరకు కేంద్రం 2015-16 రైల్వే బడ్జెట్లో కాజీపేట రైల్వే జంక్షన్ – బల్లార్ష సెక్షన్లో (తెలంగాణ, మహారాష్ట్రలలో) హసన్‌పర్తి రోడ్డు – రైల్వేస్టేషన్ వరకు 202 కిలోమీటర్ల మూడో నిర్మాణానికి రైల్వేబోర్డు రూ.2,063కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు యుద్ధప్రాతిపాదికన జరిగాయి.
రైల్వేశాఖ రాఘవపూర్ – మందమర్రి వరకు 33కిలోమీటర్లు, సిర్పూర్ కాగజ్‌నగర్ – మాణిక్‌ఘర్ వరకు 60 కిలోమీటర్ల మూడో లైన్‌ను గతంలోనే పూర్తి చేయగా ఆ లైన్ల మీదుగా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను ఇప్పటికే నడిపిస్తున్నారు. హసన్‌పర్తి రోడ్డు – ఉప్పల్ రైల్వేస్టేషన్ వరకు మూడోలైన్ పనులు అన్ని విధాలా కావడంతో ఇటీవల రైల్వే జీఎం ఏకే జైన్ ఆదేశాలతో రైల్వే ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించి ఆ పట్టాల మీదుగా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను నడిపించవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హసన్‌పర్తి రోడ్డు – మాణిక్‌ఘర్ రైల్వేస్టేషన్ వరకు మూడో లైన్లో రైళ్లు షురువైతే మహారాష్ట్రలోని మాణిక్ఘర్కు నేరుగా రైళ్లు అధికారులు చెబుతున్నారు. ఈ మూడో లైన్ ఏర్పాటుతో కాజీపేట – బల్లార్ష సెక్షన్లో రాకపోకల్లో ఆలస్యం ఉండదని, రైల్వేశాఖకు ప్యాసింజర్, సరుకు రవాణా (గూడ్స్) రైళ్లతో భారీగా ఆదాయం సమకూరుతుందని అంటున్నారు.