భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(ఆర్ఎస్సీటీఐ) నిరుద్యో గుల ఉపాధికి రాచబాట చూపుతున్నది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో టీటీడీసీ సంస్కృతి విహార్‌లో 2002 నుంచి యువతీయువకులకు ఆయా రంగాల్లో అనుభవజ్ఞులతో ఉచిత శిక్షణనిస్తున్నది. భోజనంతోపాటు వసతి సదుపాయం కల్పిస్తున్నది. ఇప్పటి వరకు 15, 293 మందికి ట్రైనింగ్ ఇవ్వగా, 12, 576 వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం మహిళలకు బ్యూటీపార్లర్, మగ్గంవర్క్లో శిక్షణ ఇస్తామని, ఈ నెల 27న పేర్లు నమోదు చేసుకోవాలని డైరెక్టర్ మాధురి సూచించారు.
ఎస్బీఐ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్సీటీఐ) నిరుద్యోగ యువతకు చేయూతనిస్తోంది. హసన్‌పర్తిలోని టీటీడీసీ సంస్కృతి విహార్‌లో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల యువతీయువకులు స్వయంఉపాధి పొందేందుకు శిక్షణ నిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన వారికి 2002లో ఉచిత ట్రైనింగ్‌ను ప్రారంభించింది. మహిళలకు టైలర్, బ్యూటీపార్లర్, జ్యూట్ బ్యాగులు, మగ్గం వర్క్, అగర్బత్తి, క్యాండిల్ తయారు చేయడంలో తర్ఫీదునిస్తున్నది. అలాగే యువకులకు బైక్ మెకానిక్, సెల్‌ఫోన్ రిపేర్, ఫొటో అండ్ వీడియోగ్రఫీ, హౌస్ వైరింగ్, తదితర అంశాలపై 30 రోజుల్లో అనుభవజ్ఞులైన అధికారుల(డొమెన్ స్కిల్ ట్రైనర్)తో శిక్షణ ఇస్తున్నారు. 2002 నుంచి 2022 వరకు 485 బ్యాచ్‌ల్లో 15, 293 మంది శిక్షణ పొందారు. ఇందులో బ్యాంక్ రుణం తీసుకొని 5718 మంది సెటిల్ అయ్యారు. 6391 మంది స్వయంగా, సెల్ వేజ్ ద్వారా 467 మంది శిక్షణ పొందిన రంగాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
మహిళలు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ
మహిళలు, పురుషులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తారు. ఉచిత భోజనంతోపాటు వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత టూల్ కిట్లు, సర్టిఫికెట్లు అందిస్తారు. ట్రైనింగ్ తీసుకోవాలనే ఉమ్మడి వరంగల్‌లోని యువతీ యువకులు కనీస విద్యార్హత, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 45లోపు ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్‌కార్డు ఉండాలి. చదువుకుంటున్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వరు. వివరాల కోసం టీటీడీసీ, సంస్కృతి విహార్, హసన్‌పర్తిలో లేదా 9704056522, 9849307873, 6281260878, 9502621342 నంబర్లలో సంప్రదించవచ్చు.
చాలా మంది స్థిరపడ్డారు
భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణా సంస్థలో ట్రైనింగ్ తీసుకుని చాలా మంది స్వయంశక్తితో స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యూటీపార్లర్, మగ్గం వర్క్ శిక్షణ కోసం ఈ నెల 27న పేరు నమోదు చేసుకోవాలి. 28 నుంచి శిక్షణ ప్రారంభిస్తారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– డైరెక్టర్ మన్నే మాధురి