పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 29 : చేనేత సంఘాల ద్వారా ఉత్పత్తి చేసిన బెడ్షీట్లు సంఘాల్లో మూలుగుతున్నాయి. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో సంఘా లు చతికిల పడే పరిస్థితి ఏర్పడింది. ఏడాదిగా కొనుగోళ్లు జరగకపోవడంతో ఉత్పత్తులు పేరుకుపోతున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 54 వరకు చేనేత సహకార సంఘాలు, 26 వరకు మాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న కార్మికులకు రోజు, నెలవారీ కూలీతో పాటు తాము తయారు చేసిన ఉత్పత్తులను బట్టి రేట్లను చెల్లిస్తారు. చేనేత సంఘాల మీద ఆధారపడి కూలీ రేట్ల ప్రకారం నేస్తున్న నేతన్నలకు ఇచ్చే వేతనం కూడా పెండింగ్‌లో ఉండటంలో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి ఉత్పత్తి చేస్తున్న బెడ్షీట్లను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో సంఘాలు నడిచే పరిస్థితి లేదంటూ బాధ్యులు చెబుతున్నారు.
బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ కార్మికులకు కూలీ చెల్లించాల్సి వస్తున్నదన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం టెస్కో ద్వారా మూడు, ఆరునెలలకోసారి కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తలేదన్నారు. గతేడాది నవంబర్‌లో టెస్కో అధికారులు కొనుగోలు చేశారని, ప్రస్తుతం ముందుకు రావడం లేదని వాపోతున్నారు. సంఘాల్లో బెడ్షీట్లు నిల్వ ఉంచడానికి కూడా స్థలం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్‌లోని కొత్తవాడ, ఆటోనగర్, తుమ్మకుంట, ఎల్బీనగర్, ఉర్సు కరీమాబాద్తో పాటు పత్తిపాక శాయంపేట, సూరారం, కమలాపురం, జమ్మికుంట, వీణవంక ప్రాంతాల్లోని చేనేత సంఘాల్లో రూ.10 కోట్ల వరకు స్టాకు నిల్వ ఉంది. ఒక్క కొత్తవాడలోనే రూ. కోటిపైన నిల్వ ఉన్న ట్లు తెలుస్తున్నది. అలాగే కార్పెట్లను కూడా నాలుగు నెలల నుంచి కొనుగోలు చేయకపోవడంతో రూ.3 కోట్ల వరకు నిల్వ ఉన్నాయని నేత సంఘాల ప్రతినిధులు చెబుతున్నా రు. ఇకనైనా టెస్కో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బెడ్షీట్లను కొనుగోలు చేయాలని వారు విజప్తి చేస్తున్నారు.