దారుణం.. అమానుషం.. సమాజమే సిగ్గుపడే సంఘటనొకటి ఆలస్యంగా వెలుగుచూసింది. మనుషులమనే సంగతి మరచి ఓ మహిళను వివస్త్రను చేసిన గుండు గీసి జననాంగంలో జీడి పోసి విచక్షణ లేకుండా చెట్టుకు కట్టేసి కొడుతూ అత్యంత క్రూరంగా, ఆటవికంగా ప్రవరించిన తీరు సర్వత్రా కలకలం రేపింది. ‘తప్పు చేశాను.. వదిలేయడం’ అని ప్రాధేయపడినా కనికరం లేకుండా చెప్పులతో కొడుతూ రాక్షసానందం పొందారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనకు వివాహేతర బంధం కారణం కాగా, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఆరు రోజులు క్రితం జరిగింది.
దాడికి తెగబడ్డ 13మందిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకోగా.. బాధిత మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై మహిళా జడ్జిలు ఆరా తీశారు. మరోచోట నవమాసాలు మోసి పెంచిన తల్లినే కడతేర్చాలని కన్నకొడుకే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ‘నువ్వు ఉన్నన్ని రోజులు భూమి, పైసలు రావు.. చస్తేనే వస్తయ్’ అంటూ బ్యాంకులో డబ్బుల కోసం రాక్షసుడిలా మారి తల్లిని చిత్రహింసలు పెట్టగా ప్రస్తుతం ఆమె చావుబతకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన సంగెం మండలం కుంటపల్లిలో శనివారం జరిగింది. – సుబేదారి/సంగెం, జూన్ 28
సుబేదారి, జూన్ 28 : భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే ఆగ్రహంతో భార్య కుటుంబ సభ్యులతో కలిసి మహిళపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను చెట్టుకు కట్టేసి అరగుండు గీసి, జననాంగంలో జీడి పోసిన దాడి చేసిన అమానవీయంగా ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఆరు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన గంగకు ములుగు జిల్లా బొల్లోనిపల్లికి చెందిన రాజుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రాజు తన బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలిపెట్టి పోయాడు.
దీంతో రాజు భార్య గంగ విషయం తెలుసుకొని పిల్లలతో తాటికాయలకు వచ్చి భర్త విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారిద్దరినీ గంగ కుటుంబ సభ్యులు ఐదు రోజుల క్రితం వెతికి తాటికాయలకు తీసుకొచ్చారు. రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఇంటి ముందు చెట్టుకు కట్టేశారు. వివస్త్రను చేసి.. గుండు గీసి, మర్మాంగాల్లో జీడి పోశారు. ‘నేను తప్పు చేశాను క్షమించండి..’ అని ఆ మహిళ వేడుకున్నా వినకుండా చెప్పులతో దాడి చేశారు. రాజుకు కూడా గుండు గీయించారు. ఈ అమానుష ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తన భర్త నవీన్‌కుమార్ నగరం, పట్టణంలో రైల్వే, ఎఫ్‌సీఐ కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులకు వడ్డీ రూపేణా డబ్బులు ఇస్తారని అతడి భార్య త్రిపురాది మాధవి తెలిపారు. శుక్రవారం కాజీపేటకు చెందిన రైల్వే కార్మికుడు గడ్డం ప్రవీణ్‌కుమార్ తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని, అప్పు వసూలుకు కాజీపేటకు వెళ్తున్నానని చెప్పి ఉదయం బైక్‌పై బయటకి వచ్చినట్లు తెలిపారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తన భర్త స్నేహితుడు చేనుమల్ల సతీశ్‌తో కలిసి రాత్రి 11.30 గంటలకు ప్రవీణ్‌కుమార్ రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా, తన భర్త రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడని తెలిపారు.
తన భర్త నవీన్‌కుమార్ ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు మెడలో పులిగోరు చైన్, 8 చేతి ఉంగరాలు, బంగారు రుద్రాక్ష మాల, బంగారు చేతికడియం ఉన్నాయని, దాదాపు రూ.6లక్షల విలువైన బంగారు వస్తువులతో బయటికి వచ్చారని తెలిపారు. తన భర్త వద్ద ఉన్న బంగారం వస్తువులను దొంగిలించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్‌కుమార్ విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. బాధితురాలు మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
-నవీన్‌కుమార్ భార్య మాధవి
కాజీపేట, జూన్ 28 : కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్‌లో ఓ వడ్డీ వ్యాపారి శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన త్రిపురాది నవీన్‌కుమార్ (55) కొంతకాలంగా కాజీపేట పట్టణంలో వడ్డీ వ్యాపారం నడుపుతున్నారు. పట్టణంలోని రైల్వే కార్మికులు, ఎఫ్‌సీఐ, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులకు నవీన్‌కుమార్ వడ్డీకి డబ్బులు ఇస్తుంటాడు. కాజీపేట ఈఎల్ఎస్ షెడ్డులో గడ్డం ప్రవీణ్‌కుమార్ (34) రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ స్థానిక ఈఎల్ఎస్ రైల్వే క్వార్టర్స్ 583/4లో కొంతకాలంగా ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ ఆర్థిక పరిస్థితి భాగాలేక కొన్ని నెలల క్రితం నవీన్‌కుమార్ వద్ద రూ.50వేలు వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. కాగా, ప్రవీణ్ తిరిగి అప్పు చెల్లించకుండా నవీన్‌కుమార్‌ను తిప్పించుకుంటున్నాడు.
శుక్రవారం రాత్రి నవీన్‌కుమార్ ప్రవీణ్‌కుమార్ రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లాడు. ఇద్దరు కలిసి అక్కడే మద్యం తాగారు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ డబ్బులు అడగడంతో మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. ఆవేశంలో ప్రవీణ్‌కుమార్ వంట గదిలోని కత్తితో నవీన్‌కుమార్‌ను పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అర్ధరాత్రే విశ్వనీయంగా అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నవీన్‌కుమార్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్‌కుమార్ పారిపోయినట్లు తెలిపారు. కాగా, శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఇన్చార్జి సీఐ పుల్యాల కిషన్, ఎస్సై నవీన్‌కుమార్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, రైల్వే ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ పాండేన్, సీఐ చటర్జీ, ఇతర అధికారులు పరిశీలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫొరెన్సిక్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా, రైల్వే ఉద్యోగి గడ్డం ప్రవీణ్‌కుమార్ కాజీపేటలోని ఈఎల్ఎస్ షెడ్డులో విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య, కొడుకు ఉండగా, కొంతకాలం క్రితం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో ప్రవీణ్ భార్య రైల్వే క్వార్టర్స్‌లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రవీణ్‌పై కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ఈఎల్ఎస్ షెడ్డులో తిరిగి ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు.
మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన సంఘటనలో ధర్మసాగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ధర్మసాగర్, మడికొండ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్, కిషన్, ఎస్సైలు, సిబ్బంది శనివారం తాటికాయల గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు.
సంఘటన అనంతరం రాజు, అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇద్దరు కూడా గ్రామంలో కనిపించకుండా పోయారు. వారిద్దరు ఎటు వెళ్లారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ అమానుష సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి శనివారం తాటికాయల గ్రామానికి వెళ్లారు. మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై ఆరా తీశారు.
సంగెం,జూన్ 28 : నవ మాసాలు మోసి కనిపెంచిన కొడుకే కాలయముడయ్యాడు. మిత్తి డబ్బుల కోసం తల్లిదండ్రులను చిత్రహింసలు పెడుతున్న కొడుకు చివరికి నరరూప రాక్షసుడిలా మారాడు. కనీసం తనకు జన్మనిచ్చిందన్న కనికరం లేకుండా నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ హృదయ విదారక ఘటన సంగెం మండలంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు, బాధితురాలు, ఆమె భర్త కథనం ప్రకారం.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ముత్తినేని వినోద, సాంబయ్య దంపతులకు కుమార్తె స్వరూప, కొడుకు సతీష్ ఉన్నారు. ఇద్దరికి పెండ్లిళ్లు చేశారు. సాంబయ్యకు ఉన్న మూడు ఎకరాల భూమి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అప్పగించగా, వచ్చిన డబ్బులను కుమారుడికి ఇచ్చారు. రూ.6లక్షలు మాత్రం బ్యాంకులో తమ పేరుమీద ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నారు.
కాగా, వాటి ద్వారా వచ్చే మిత్తి డబ్బులు కూడా తనకే ఇవ్వాలని కొడుకు సతీశ్ కొద్దిరోజులుగా ఇంట్లో గొడవలు చేస్తున్నాడు. టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా సాంబయ్యకు ప్లాట్ వచ్చింది. అలాగే 20 గుంటల పొలం కూడా ఉంది. తన కుమారుడికి డబ్బులు ఇస్తే వృథాగా ఖర్చు చేస్తాడనుకున్న తల్లిదండ్రులు తమ పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులు, వాటి మిత్తి అక్కకు ఇస్తున్నారని, తనకు ఇవ్వడం లేదని తరచూ ఇంట్లో గొడవలు పెట్టేవాడు. దీంతో గ్రామంలో, పోలీసుస్టేషన్లో కూడా పలుమార్లు పంచాయతీలు చేశారు. సతీశ్ ఎంతకూ మారకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలోనే వేరే ఇంట్లో కిరాయికి ఉన్నారు.
నిత్యం కొడుకు పెడుతున్న టార్చర్ తట్టుకోలేక తల్లి వినోద కెనాల్లో పడి చనిపోవడానికి వెళ్లగా కొంతమంది అడ్డుకొని ఇంటికి తీసుకొచ్చారు. మరోసారి ఆమె కాళ్లపై తీవ్రంగా కొట్టాడు. ఎప్పటికైనా మిమ్మల్ని చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన సతీశ్ కుటుంబంతో వెళ్లి గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో ఉంటున్నాడు. డబ్బుల విషయంలో తీవ్రంగా ఆలోచించిన సతీశ్ కోపంతో ఈ నెల 28న తెల్లవారుజామున కుంటపల్లికి వెళ్లి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి ముత్తినేని వినోదపై ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ చల్లాడు.
ఈ క్రమంలో మెళుకువ వచ్చిన వినోద అరవగా, తండ్రి సాంబయ్య లేచి కొడుకును ఆపే ప్రయత్నం చేశాడు. ఆయనను నెట్టివేసి వినోదకు నిప్పంటించాడు. ‘నువ్వు చస్తేనే భూమి, పైసలు వస్తయి’ అని అనుకుంటూ గోడదూకి పరారయ్యాడు. చట్టు పక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పి 108 వాహనంలో వినోదను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వినోద మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. తన కుమారుడు సతీశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలిపింది. చికిత్స పొందుతున్న వినోదనను సీఐ రాజగోపాల్, ఎస్సై నరేశ్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినోద భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.