వరంగల్, జూన్ 26 : బల్దియా గ్రీవెన్స్‌లో బాధితులు ఇచ్చిన ప్రతి వినతిపై సత్వరమే స్పందించాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం ఆయన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి గ్రీవెన్స్‌లో స్వయంగా కమిషనర్ వినతులు స్వీకరిస్తుండడంతో వినతులు, ఫిర్యాదులు ఇచ్చేందుకు నగరవాసులు బారులుతీరారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ అనంతరం కమిషనర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.
పెగడపల్లి గ్రామం కార్పొరేషన్లో విలీనమైన తర్వాత తమ ఇంటికి పన్ను రావడం లేదని ఐలి చంద్రమోహన్ గౌడ్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కొత్త ఇంటి నంబర్ కేటాయించి పన్ను మదింపు చేయాలని కోరారు. అలాగే, చిన్నవడ్డేపల్లి చెరువు మధ్యలో కొంత మంది కట్ట పోస్తున్నారని, దీంతో పద్మనగర్, ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికుడు రమేశ్ ఫిర్యాదు చేశారు. ఒకటో డివిజన్ శ్రీనివాస కాలనీలో బర్రెల ఫామ్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టు పక్కల దుర్వాసన వస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
గ్రీవెన్స్‌కు మొత్తం 109 వినతులు రాగా, టౌన్ ప్లానింగ్ విభాగానికి 48, తాగునీటి విభాగానికి 6, ఇంజినీరింగ్ విభాగానికి 17, ప్రజారోగ్య విభాగానికి 10, పన్నుల విభాగానికి 24, ఎలక్ట్రీసిటీ విభాగానికి 3, డిజాస్టర్ మెనేజ్మెంట్ విభాగానికి ఒకటి వచ్చాయి. గ్రీవెన్స్‌లో అదనపు కమిషనర్లు రవీందర్ యాదవ్, ఇన్చార్జి అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్‌వో శ్రీనివాసరావు, ఆర్ఎఫ్వో పాపయ్య, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, డిప్యూటీ కమిషనర్ జోనా, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.