నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల కోలాటాలు, యువతీయువకుల కేరింతల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం కనులపండువగా సాగిన నిమజ్జనోత్సవానికి భక్తజనులు అశేషంగా తరలిరాగా, దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనాలను పూలు, అరటి ఆకులతో అందంగా అలంకరించగా తీరొక్కరంగు విద్యుద్దీపాల వెలుగుల్లో లంబోదరుడు మెరిసిపోయాడు. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా’ నినాదాలు చేస్తూ.. వెళ్లి రావయ్యా గణపయ్యా.. వచ్చే ఏడాదికి మళ్లీ రావయ్యా అంటూ సాగనంపారు. ఈ సందర్భంగా వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని నిమజ్జన ప్రాంతాలు భక్తులతో సందడిగా కనిపించగా తెల్లవారుజాము వరకు నిమజ్జనం కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో అంతటా ప్రశాంతంగా ముగిసింది.