జయశంకర్ భూపాలపల్లి, మే 3 (నమస్తే తెలంగాణ) : యాసంగి వరి కోతలు చివరి దశ కు చేరుకున్నాయి. ధా న్యం రాశులు కొనుగో లుకేంద్రాల్లోకి చేరుతున్నాయి. గత 15 రోజులుగా వడ్ల కుప్పలు సెంటర్లలో ఆరబోసి కనిపిస్తున్నాయి. ఇంతవరకు ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజా కొనలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సివిల్ సప్ల య్స్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఇప్పటి వరకు 90 సెంటర్లను ప్రారంభించారు.
ఆయా కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తరలించి క్రయ విక్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు అధికారులు కొనుగోళ్లను ప్రారంభించలేదని, వర్షాలు వస్తే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధిక శాతం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే కావడం, ఒక్కో కేంద్రంలో పదుల సంఖ్యలో భాగస్వాములుండడంతో వారి మధ్య సయోధ్య కుదరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేవని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటికే 11 మిల్లులు డిఫాల్టులో ఉండడంతో అధికారులు వారికి ధాన్యం కేటాయించలేదు.
1.60 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం
జిల్లాలోని 12 మండలాల్లో 1.60 లక్షల టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యం గా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కేంద్రాలకు టార్పాలిన్లు, గన్నీ సంచులు చేరుకోలేదు. షెడ్లు ఏర్పాటు చేయలేదు. తాగునీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉందని రైతులంటున్నారు. ఇప్పటి వరకు కేవలం ఐదు బాయిల్డ్ రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించారు. అయితే పాత నిల్వలు ఇంకా ఉండడంతో కొత్తగా కొనుగోలు చేసే ధాన్యాన్ని ఎక్కడ ఉంచాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
11 డిఫాల్ట్ మిల్లులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 30 రైస్ మిల్లులుండగా ఐదు మిల్లుల నుంచి సీఎంఆర్ డెలివరీ జరుగలేదు. 4,396 టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ. 18. 29 కోట్లు కొల్లగొట్టారు. జిల్లాలోని కాటారం మండలం దామెరకుంటకు చెందిన రుద్ర రైస్‌మిల్, రేగొండ మండలం భాగిర్థిపేటకు చెందిన దుర్గా భవాని, మొగుళ్లపల్లికి చెందిన సువర్ణలక్ష్మి, గణపురం మండలం చెల్పూరుకు చెందిన లక్ష్మీగణపతి, గణపురానికి చెందిన శ్రీనివాస పద్మావతి రైస్ మిల్లులు ప్రభుత్వానికి బకాయి పడ్డాయి.
ఆ యాజమాన్యాలకు జూన్ 16 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా అధికారులు ఇటీవల రైస్ మిల్లులను తనిఖీ చేసి గొర్లవీడుకు చెందిన వెంకటేశ్వర, కొండంపేటకు చెందిన వెంకటేశ్వర, బయ్యారానికి చెందిన అన్నపూర్ణ, పెద్దాపూర్‌కు చెందిన అమ్మ, ఇప్పలపల్లికి చెందిన వాగ్ధేవి, చెల్పూరుకు చెందిన హరిహర రైస్ మిల్లులను డిఫాల్ట్ లిస్టులో చేర్చడంతో జిల్లాలో మొత్తం 11 మిల్లులకు ధాన్యం కేటాయింపులు నిలిచిపోయాయి.