గిర్మాజీపేట: తమకు రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా భారమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ. 5.45, ఆరు నుంచి ఎనిమిది వరకు రూ. 8.17, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ. 10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పెంచిన వేతనం మాట అటుంచితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.3వేలు కూడా అం దించడం లేదని ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లకు మే వరకే జీతాలు అందాయి. గతంలో పాఠశాలల్లో పారిశుధ్య పనులను జీపీ సిబ్బంది చూడగా, ప్రస్తుతం ఆ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయింది.