ములుగు, జూలై 7 (నమస్తేతెలంగాణ): గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా మారనున్నది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలతో కలిసి పురపాలికగా అవతరించనున్నది. 2019 ఫిబ్రవరి17న జిల్లా ఏర్పడిన నాటి నుంచి ములుగు పట్టణం పంచాయతీగానే కొనసాగింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కేంద్రంగా ఉన్న ఏకైక ములుగు జిలా కేంద్రాన్ని ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలను కలుపుకొని మున్సిపాలిటీగా మార్చేందుకు ఆయా పంచాయతీల పాలకవర్గాలు తీర్మానాలను చేయించి ప్రతిపాదనలు పంపించాయి. దీంతో అప్పటి ప్రభుత్వం శాసనసభలో పురపాలక చట్టం 2019కు సవరణ చేయడానికి ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. మూడు గ్రామపంచాయతీలను కలుపుకొని 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 16,533 జనాభాతో 12,486 మంది ఓటర్లతో మున్సిపాలిటీగా ఏర్పాటవుతున్నది. తిరిగి జనాభా లెక్కలు పూర్తయినట్లయితే ప్రస్తుత జనాభాతో పాటు ఓటర్లు మరో 25 శాతం పెరిగే అవకాశం ఉంది.
ములుగు మేజర్ గ్రామపంచాయతీలో జనాభా తక్కువగా ఉందనే కారణంగా ఇప్పటి వరకు మున్సిపాలిటీగా మారేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ములుగుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను విలీనం చేసి మున్సిపాలిటీలో కలుపనున్నారు. ములుగు గ్రామపంచాయతీ పరిధిలో పాల్‌సాబ్‌పల్లి, రంగారావుపల్లి, ప్రేమ్‌నగర్, మాధవరావుపల్లి గ్రామాలున్నాయి. జీవంతరావుపల్లిలో గణేష్లాల్పల్లి శివారు గ్రామం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగులో 16 వార్డులు, 4 శివారు పల్లెలతో కలుపుకొని 12,135 జనాభా 9,422 ఓటర్లు ఉన్నారు.
అదేవిధంగా బండారుపల్లిలో 12 వార్డుల్లో 3,187 జనాభా 2,436 ఓటర్లు, జీవంతరావుపల్లి గ్రామంలో శివారు పల్లెతో కలుపుకొని 8 వార్డులు, 1,211 జనాభా, 628 ఓటర్లున్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లును శాసనసభ, శాసనమండలిలో పాస్ చేసి గవర్నర్ ఆమోద ముద్ర కోసం పంపించగా గత గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో గవర్నర్ ఆమోద ముద్ర లభించింది.