గీసుగొండ/కరీమాబాద్/చెన్నారావుపేట/ఖానాపురం, జనవరి 14: జిల్లాలోని ఆలయాల్లో శనివారం గోదారంగనాథుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతును తిలకించారు. ఇందులో భాగంగా గీసుగొండ మండలం కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణ వేడుకను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలతోపాటు వరంగల్, హనుమకొండ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలుకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భోగి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ధనుర్మాసోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో అర్చకులు కాండూరి రామాచార్యులు, ఫణింద్రాచార్యులు, విష్ణుచార్యులు పురుషోత్తమచారి, ఈవో శేషగిరి, ఉత్సవ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, భక్తులు డాక్టర్ రాజేంద్రప్రసాదరెడ్డి-వనజ, దేవేందర్, సర్పంచ్‌లు నాగేశ్వర్రావు, కవిత, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కరీమాబాద్ రంగలీలా మైదానంలోని ఉర్సుగుట్టపై కొలువైన గోదాసహిత రంగనాయకస్వామి ఆలయంలో కల్యాణోత్సవం కనులపండుగలా జరిగింది.
భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నారావుపేట మండలం లింగిగిరిలో గోదాదేవి, స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి మహా జాతరను ఏటా నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రెండో రోజు శనివారం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు దేవతామూర్తులకు పట్టువస్ర్తాలు సమర్పించి అంగరంగవైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీనివాసచార్యులు తెలిపారు. సర్పంచ్ మాదారపు భాస్కర్, ఉప సర్పంచ్ రాజశేఖర్, ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న, నర్సింహారావు, అశోక్, కుమార్, దొడ్డ వెంకన్న పాల్గొన్నారు. ఖానాపురం మండలం బుధరావుపేట వేంకటేశ్వరాలయంలో గోదాదేవి రంగనాయకుల కల్యాణం అర్చకుడు వేణుగోపాలస్వామి ఆధ్వర్యంలో కనులపండువగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీకి సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్ కూతురు హరిప్రియ తన మొదటి నెల వేతనాన్ని అందించారు. వేడుకల్లో చైర్మన్ కర్రె కృష్ణారెడ్డి, కుసుమ సురేశ్, కవిత, శ్రీనివాస్, సింగు సుధాకర్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, సురేశ్, సోమయ్య, నాగరాజు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: ధనుర్మాసం చివరి రోజు రామన్నపేట బట్టలబజార్‌లోని బాలానగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి శ్రీగోదారంగనాయకుల కల్యాణ మహోత్సవాన్ని అర్చకుడు శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర సేవా సమితి-1 అధ్యక్షుడు గందె గోవిందాచార్యులు ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు గోదా అమ్మవారికి అభిషేకం, కుంకుమ అర్చన నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి వేదికపై ఆసీనులను చేసి కనులపండుగగా కల్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చకులు శేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, సిబ్బంది అవినాశ్, శ్రీకాంత్, భక్తులు పాల్గొన్నారు.