నమస్తే నెట్వర్క్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు కదం తొక్కారు. బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు, రాస్తారోకోలతో హోరెత్తించడంతో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఒక్కరోజు సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. బీజేపీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని, 17 డిమాండ్లను నెరవేర్చాలని, 10గంటల పనిదినాలకు అనుమతినిచ్చిన జీవోను రద్దు చేయాలని, రూ.26 వేలను కనీస వేతనంగా నిర్ధారించాలని, విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల, జేఏసీ కార్మికుల హక్కుల ప్రయోజనాలను కాపాడాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
సమ్మెలో భాగంగా వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట బీఆర్టీయూ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐసీటీయూ, టీఎన్టీయూసీ తదితర సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలి, మోదీ డౌన్ డౌన్, కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలంటూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయా జిల్లాల్లోని ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మగా మారిన మోదీ 60కోట్ల మందికి పైగా కార్మికుల శ్రమను దోచుకునేందుకే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
ఉమ్మడి జిల్లాలోని బ్యాంకులు, ఎల్ఐసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కార్యకలాపాలు కొనసాగలేదు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్తు భవన్ ఆవరణలో తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన చేపట్టి నినాదాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి ఏరియా సింగరేణి కార్మికులు ఎవరూ విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు గనులన్నీ బోసిపోగా, ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం ఓసీ2లో కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఆటో, ఎల్ఐసీ, బ్యాంక్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, హమాలీ, భవన నిర్మాణ, షాపింగ్ మాల్, అసంఘటిత రంగ, కాంట్రాక్ట్, హాస్పిటల్ కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణకాలనీ : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం సుమారు 90 శాతం మంది సింగరేణి కార్మికులు విధులను బహిషరించడంతో భూపాలపల్లి ఏరియాలోని 4 ఉపరితల గనులు, 2 భూగర్భ గనుల్లో సుమారు 9 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు సుమారు రూ. 3 మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు ఉద్యోగులు వేతన రూపంలో రూ. 1.60 కోట్ల వరకు నష్టపోయారని, ఏరియాలో 10 శాతం అత్యవసర సిబ్బంది విధుల్లో పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.