గ్రేటర్ వరంగల్‌లో చెత్త సేకరణ లెక్క అస్తవ్యస్తంగా ఉంది. రోజుకు ఎన్ని ఇళ్లలో చెత్త సేకరణ జరుగుతున్నది? ఎక్కడినుంచి ఎంత వస్తున్నది? అనే లెక్కలు కార్పొరేషన్ వద్ద లేవు. రోజుకు 450 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నదన్న గుడ్డి లెక్క మాత్రమే ఉంది. గ్రేటర్‌లోని సుమా రు 2.70 లక్షల గృహాల నుంచి ప్రతి రోజు చెత్త సేకరించాల్సి ఉంది. అయితే ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారనే దానిపై అధికారులకు ఎలాంటి సమాచారం లేదు.
ఈ సమస్యను అధిగమించేందుకు రేడియా ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ట్రాకింగ్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నగరంలోని కమర్షియల్ జోన్లలో ఈ సాంకేతికతతో చెత్తను సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)తో అనుసంధానం చేసి చెత్త సేకరణ ఇళ్లను గుర్తిస్తున్నారు. దీనివల్ల ప్రతి రోజూ ఎన్ని గృహాల నుంచి చెత్త సేకరిస్తున్నారనే లెక్కలు పక్కాగా తేలనున్నాయి. ఏప్రాంతం నుంచి ఎక్కువ చెత్త వస్తున్నదనే సమాచారాన్ని తెలుసుకోనున్నారు.
కమర్షియల్ జోన్లలో అమలు చేస్తున్న ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్‌లో భాగంగా 11వేల షాపులకు స్కానర్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు చెత్త సేకరించే కార్మికులకు ఐసీసీసీ ప్రతినిధులు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ యంత్రాలను అందజేశారు. వారం రోజులుగా వీరు చె త్తను సేకరించిన తర్వాత ట్యాగ్ మిషన్ ద్వారా షాపు ముందున్న ట్యాగ్‌ను స్కాన్ చేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎన్ని షాపుల నుంచి చెత్త సేకరణ జరుగుతున్నదన్న సమాచారం ఐసీసీసీకి అందుతున్నది.
ప్రయోగాత్మకంగా కమర్షియల్ జోన్లో అమలు చేస్తున్న చెత్త సేకరణ ట్రాకింగ్ విధానాన్ని త్వరలో గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో అమలు చేయనున్నారు. కొత్త పద్ధతి అమలు తీరును పరిశీలించిన తర్వాత ప్రతి ఇంటికి ట్యాగ్ ఏర్పాటుచేసి చెత్త సేకరించనున్నారు. స్వచ్ఛ ఆటోకు కేటాయించిన గృహాల నుంచి చెత్త సేకరణ జరిగిందా? లేదా అనే విషయం ట్రాకింగ్ ద్వారా తెలియనుంది.
గ్రేటర్‌లోని ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం. స్మార్ట్‌సిటీలో భాగంగా తప్పనిసరిగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాల్సి ఉంది. వంద శాతం సేకరించడంలో భాగంగానే ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ పద్ధతిని తీసుకువచ్చాం. ప్రస్తుతం 11వేల షాపులకు స్కానర్లు ఏర్పాటు చేసి చెత్త సేకరిస్తున్నాం. త్వరలోనే గ్రేటర్ అంతా ఈ విధానాన్ని అమలు చేస్తాం.
– డాక్టర్ రాజేశ్, చీఫ్ మున్సిపల్ హెల్త్ అధికారి