తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. విఘ్నేశ్వరుడికి సోమవారం ఘ నంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహ నాల్లో వినాయక విగ్రహాలను ఉంచి కనుల పండువలా శోభాయాత్రలు నిర్వహించారు. దారి పొడువునా డప్పు చప్పుళ్లు, నృత్యాలు, విన్యాసాలతో చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. గణనాథులకు ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశా రు. వాడవాడలా ప్రతిష్ఠించిన ప్రతిమలను అందంగా అలంకరించిన వాహనాల్లో తరలించారు. దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి, మధ్యకోటలోని ఏకశిల, ఉర్సు, మామునూరులోని బెస్తం, పెద్దావి చెరువు, కోనారెడ్డి, ఇల్లంద పెద్ద చెరువు, గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కట్టమల్లన్న, ఎల్గూరు చెరువు, పాకా ల వాగు, సర్వాపురం శివారు దామెర, తదితర చెరువుల్లో గణ నాథులను నిమజ్జనం చేశారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. గణపతి బప్పా మోరియా..’ అంటూ నినదిస్తూ గంగమ్మ ఒడికి సాగనంపారు. కాగా, దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద కలెక్టర్ సత్య శారద, కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వినాయక నిమజ్జన వేడుకలను మేయర్ సుధారాణి ప్రారంభించారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు దామెర, ఉర్సు చెరువులో వినాయక నిమజ్జనాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు.