నల్లబెల్లి, మే 9 ;వేసవిలో అరుదుగా కనిపించే ఫలం వాటర్ యాపిల్. పుష్కలంగా పోషకాలున్న ఈ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్య ఔషధంగానూ పనిచేస్తుంది. పెట్టుబడి శ్రమ అవసరం లేకుండా ఈ పండ్ల సాగుకు మన నేలలు కూడా అనుకూలమే. అందుకే వర్షాభావ పరిస్థితులను తట్టుకొనేందుకు సంప్రదాయ పంటలకు బదులు కొందరు రైతులు ఇలా ప్రత్యామ్నాయ పండ్ల సాగుకు మొగ్గుచూపుతున్నారు. కేవలం నీటి వసతి కల్పించి, సస్యరక్షణ చర్యలు పాటిస్తే చాలు మంచి ఆదాయం పొందే వీలున్న రోజ్ యాపిల్‌ను నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో ఓ రైతు వేయగా ప్రస్తుతం పండ్లు కోతకు వచ్చాయి.
వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రైతులు ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం దీర్ఘకాలికంగా ప్రత్యామ్నాయ పంటల సాగే మేలంటున్నారు మండల రైతన్నలు. మామిడి, బత్తాయి, నిమ్మ, పసుపు, జామ, మల్బరీ వేప, ఎర్రచందనం, శ్రీగంధం, మునగ తదితర పంటల సాగుపై దృష్టిపెట్టారు. ఈక్రమంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామానికి చెందిన వేముల సంపత్‌రెడ్డి అనే రైతు తనకు ఉన్న రెండెకరాల భూమిలో మామిడి తోటను సాగు చేశాడు. ఇదే తోటలో దానిమ్మ, ఉసిరి, సపోట, బత్తాయి చెట్లను పెంచడంతో పాటు రోగ నిరోధక శక్తినిచ్చే ఔషధ గుణాలు కలిగిన వాటర్ యాపిల్‌ను పది గుంటల్లో సాగు చేశాడు. దీనిని రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సైజీజియం ఆక్వియం. ఈ మొక్క మిర్టేసి కుటుంబానికి చెందినదిగా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మొక్క జనవరి, ఫిబ్రవరిలో పూత దశకు వస్తుంది. ఏప్రిల్, మే, నెలల్లో కాతకు వస్తుంది. ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే వాటర్ యాపిల్ పండు అంత రుచికరమైన తీపిని ఇస్తుందని రైతు సంపత్‌రెడ్డి చెబుతున్నారు. వాటర్ యాపిల్ సాగుకు ఎలాంటి పెట్టుబడి ఉండదు. కేవలం నీటి వసతి కల్పిస్తే చాలు.
ఆరోగ్యానికి ఎంతో మేలు..
వాటర్ యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల పండ్లను ఆహారంగా తీసుకుంటే 90 గ్రాముల నీటి శాతం లభిస్తుంది. అలాగే 34 కిలోక్యాలరీల శక్తిని అందించడంతో పాటు కార్బో హైడ్రేట్స్ 8.6 గ్రాములు, ప్రోటీన్ 6 గ్రాములు, ఫ్యాట్ 3 గ్రాములు లభించే స్తూల పోషకాలు కల్గిన మొక్క ఇది, అంతేగాక రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్న వారికి ఈ ఫలం ఎంతో దోహదపడుతుంది. ఐసో మెరిక్ప్లావోన్, చాల్కోన్ అనే కెమికల్స్ ఉండడం వల్ల వాటర్ యాపిల్ తీసుక్ను వ్యక్తికి 45 నిమిషాల్లో చక్కెర శాతం యథాస్థితికి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అలాగే క్యాన్సర్, హెచ్ఐవీ, డయాబెటీస్, ఒబేసిటీ, కరోనా, చికున్‌గున్యా, మంకీగున్యా, ఫ్లూ లాంటి ప్రాణాంతక వైరస్‌లకు వాటర్ యాపిల్ అడ్డుకట్ట వేస్తుంది. గుండె పోటు, పక్షవాతం, కీళ్ల నొప్పులు, ఎముకల పటుత్వాని కి, చర్మ సౌందర్యానికి ఈ ఫలంతో పాటు దీని ఆకులు సైతం దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
పది గుంటల్లో సాగు చేశా
హనుమకొండలోని నర్సరీలో ఒక్కో వాటర్ యాపిల్ మొక్కకు రూ.200 చెల్లించి పది గుంటల్లో నాటాను. నాలుగేళ్లలో మొక్క క్రాపు దశకు వస్తుంది. పండిన ఫలాలను గతేడాదితో పాటు ఈ సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో విక్రయిస్తున్నా. కిలో ధర రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుంది. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు అలాగే గ్రామస్తులకు అవసరం మేరకు అమ్ముతున్న. ఎలాంటి పంట పెట్టుబడి లేనందున వాటర్ యాపిల్ సాగు లాభదాయకమే.
– వేముల సంపత్‌రెడ్డి, రైతు, కన్నారావుపేట
రైతులు ముందుకొస్తే ప్రోత్సహిస్తాం
అత్యంత పోషకాలున్న వాటర్ యాపిల్ సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తుంది. ఈ పంట కోసం రైతులు ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం సస్యరక్షణ చర్యలు పాటిస్తూ వర్మీ కంపోస్టును వాడితే సరిపోతుంది. ఈ మొక్క కేవలం మూడు ఏళ్లు మాత్రమే క్రాపునిస్తుంది. అందుకని మామిడి, బత్తాయి, జామతో పాటు అనేక దీర్ఘకాలిక పంటల్లో అంతర పంటగా వేసుకోవచ్చు. ఈ ఫలాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఉద్యాన శాఖను సంప్రదిస్తే ఎగుమతి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే హైదరాబాద్ లోని పలు మార్కెట్ లో సైతం రైతులు వీటి పండ్లను విక్ర యించుకొనే వీలుంది.
– జ్యోతి, డివిజన్ ఉద్యాన అధికారి