హనుమకొండ, జూలై 20 : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిండా ముంచిందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేయూ విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురసరించుకొని వాసుదేవరెడ్డి నిరుద్యోగులకు అందించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిషరించారు. అనంతరం మాట్లాడుతూ ఆగమవుతున్న, దగాపడ్డ, మోసపోయిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించిన యాప్‌ను ఈ నెల 22న హనుమకొండ సుబేదారిలోని న్యూ రాయల్ గార్డెన్లో లాంచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ మోటివేటర్ డాక్టర్ ఆకెళ్ల రాఘవేంద్ర, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన విన్నర్స్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఆైన్లెన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతి చెందిందని, పారిశ్రామిక రంగంలో సైతం నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. అలాగే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాస్, టీ హబ్, టీ వర్స్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం1,62,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనిని చెప్పుకోలేక పోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇటీవల కేటీఆర్ నిరుద్యోగుల కోసం నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు విజయవంతమైందన్నారు. యువత కదలివచ్చి ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాసుదేవరెడ్డి కోరారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, డాక్టర్ కొమురయ్య, డాక్టర్ వీరేందర్, రవి నాయక్, రామ్మూర్తి, శరత్ చంద్ర, రాజ్ కిశోర్, డాక్టర్ కంజర్ల మనోజ్, వీరస్వామి, పానుగంటి శ్రీధర్, అర్షం మధు, పబ్బోజు శ్రీకాంత్ చారి, తకళ్లపల్లి వినీల్ రావు, కె పి రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.