బయ్యారం, ఆగస్టు 15 : అస లు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చే స్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలల నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రాజుతో ఏర్పడిన పరిచయంతో రెండు నెలల క్రితం షాపు వద్దకు వెళ్లి తమ బంధువులకు ఆరోగ్యం బాగాలేదని, తమ వద్ద ఉన్న బంగారు చైన్ కుదువ పెట్టుకొని డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినప్పటికీ వినకుండా పలుమార్లు బతిమిలాడారు. బంగారం చైన్‌ను చూపించి, అందులో కొంత భాగాన్ని కట్ చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాజు దానిని పరీక్షించగా అసలైన బంగారమని తేలడంతో, 6 తులాల చైన్ పెట్టుకొని రూ. 2 లక్షలు ఇచ్చాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి గొలుసును పరీక్షించగా, అది నకిలీ బంగారమని తేలింది.
దీంతో రాజు సీసీ ఫుటేజ్ ఆధారంగా మోసం చేసిన వారి కోసం మిత్రులు, తెలిసిన వ్యక్తులతో ఆరా తీస్తున్నాడు. ఈ క్రమంలో మోసానికి పాల్పడిన వ్యక్తులు గురువారం బయ్యారంలో సంచరిస్తూ కనిపించగా, స్థానికులు గుర్తుపట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరి వద్ద అరకేజీ వరకు నకిలీ బంగారాన్ని గుర్తించారు. అనంతరం బయ్యారంలోని మిత్రుడి సమాచారంతో వ్యాపారి రాజు అక్కడికి చేరుకొని తనకు జరిగిన మోసాన్ని స్థానికులు, పోలీసులకు వివరించాడు.