నమస్తే నెట్వర్క్, నవంబర్ 19 : సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్‌లతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, దళితబంధు సాధన సమితి సభ్యులనూ స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తాయని, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్‌లు నిలదీస్తారని, లగచర్ల ఘటనపై గిరిజన సంఘం నాయకులు అడ్డుకుంటారని, రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై విద్యార్థి సంఘం నాయకులు గొంతెత్తుతారని, దళితబంధు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు రచ్చ చేస్తారని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలిచి సమస్యల గురించి ప్రశ్నించాలనుకున్న తమ గొంతును నొక్కుతోందన్నారు. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్వీ, సీఐటీయూ, డీవైఎఫ్యూ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్‌లు, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, దళిత బంధు సాధన సమితి ఉపాధ్యక్షుడు వేమునూరి జకయ్య, లంబాడా హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు వెంకట్‌నాయక్, దళిత పోరాట హక్కుల సంఘం నాయకులు ఏలేందర్, రాచర్ల రాజేందర్ తదితరులు ఉన్నారు.
బలవంతంగా గిరిజనుల భూములు లాక్కోవద్దు : పల్లా
Warangal
జనగామ చౌరస్తా : లగచర్ల చుట్టుపక్కల గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ అర్బన్ పీఎస్‌లో అక్రమంగా ముందస్తు అరెస్ట్ అయిన లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) నాయకులను కలిసి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ లగచర్ల ఫార్మా ఫ్యాక్టరీ ప్రపోజల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అరెస్ట్ చేసిన వారిని ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియనివ్వని పరిస్థితి ఉందని తెలిపారు. వెంటనే అరెస్ట్ చేసిన అమాయక గిరిజనుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం మీటింగ్‌కు గ్రామాల నుంచి మహిళలు వెళ్లడానికి ఇష్టం లేకపోయినప్పటికి కాంగ్రెస్ నాయకులు, అధికారులు వారిని బెదిరించి బస్సుల్లో తరలించారన్నారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరా స్వామినాయక్, లకావత్ నరేశ్, కొర్ర రాజేందర్, ధరంసోత్ కొమురవెల్లి, ధరావత్ శంకర్, కనకరాజు, రమేశ్, వెంకటేశ్, మున్సిపల్ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, ముస్త్యాల దయాకర్, కోఆప్షన్ మెంబర్ మసిఉర్ రెహ్మాన్, బీఆర్ఎస్ నాయకులు నీల యాదగిరి, తిప్పారపు విజయ్, ప్రవీణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్, దేవనూరి సతీశ్, యాకూబ్ పాషా, కన్నారపు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.