స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్18: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో ఆర్ఎస్ కెనాల్‌ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి పనిలో కడియం అల్లుడే కమీషన్ తీసుకుంటున్నాడని అన్నారు. ఎవరికి కాంట్రాక్టు ఇవ్వాలి?.. ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాలను మొత్తం అతడే చూసుకుంటున్నాడని, ఎంపీ నిధుల పనులకు కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు వారు తనతో చెప్పుకుంటూ బాధపడుతున్నారని రాజయ్య అన్నారు.
రైతులకు సాగు నీరు అందించేందుకు రూ.29 కోట్లు మంజూరయ్యాయని, కాల్వల మరమ్మతు పనులు చేపట్టినట్లు చెబుతున్న కడియం, పనుల టెండర్ ఎవరికి ఇచ్చారు?, ఏం పనులు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు. అక్కడక్కడా చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించే వరకు ఆమరణ దీక్ష చేయడానికైనా తాను సిద్ధమని రాజయ్య అన్నారు. చాగల్లు ఆర్ఎస్ కెనాల్లో పనులు పూర్తయ్యాయని, రైతులకు సాగునీరు అందుతున్నదని అబద్ధాలు చెబుతూ కడియం తిరుగుతున్నాడని, మీడియా సాక్షిగా కెనాల్‌ను తాను పరిశీలించానని, అకడ ఎలాంటి పనులు పూర్తి కాకపోగా, గడ్డి పెరిగి, ముళ్ల పొదలు ఉన్నాయన్నారు.
ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి కడియంకు సిగ్గు ఉండాలని విమర్శించారు. సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని కోరిన వ్యక్తికి మరోసారి వస్తుందని నచ్చచెప్పకుండా చాగల్లు గ్రామానికి చెందిన చేపూరి మహేందర్‌ను అహంకారంతో ‘తమాషా చేస్తున్నావా, బయటకు పంపండి’ అని కడియం శ్రీహరి హెచ్చరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయని చెబుతున్న కడియం దఫాల వారీగా కొందరికే ఇస్తూ పేదలను మోసం చేస్తున్నాడని, దమ్ముంటే ఇందిరమ్మ ఇండ్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ జడ్పీటీసీ మారపాక రవి, కుడా మాజీ డైరెక్టర్ ఆకుల కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్రెడ్డ్డి, మాజి సర్పంచ్ సురేశ్, నాయకులు అక్కనపల్లి బాలరాజు, కనకం గణేశ్, పొన్న రంజిత్, సంజీవ, గుండె మల్లేశ్, ఒగ్గు రాజు, గాదె రాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయాలకు పైసా కూడా ఖర్చు చేయలేదని రాజ య్య విమర్శించారు. జీడికల్ రామచంద్రస్వా మి ఆలయ అభివృద్ధికి రూ.4 కోట్లు, చిల్పూరు బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ. 10కోట్లు మంజూరైనా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. దేవాదాయ భూములపై కడి యం కన్నుపడిందన్నారు. సిగ్గుంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటికి రావాలని విసిరారు.