లింగాలఘనపురం, ఏప్రిల్ 19 : సింహం వస్తున్నదంటే తోడేళ్లకెంత భయమో.. కేసీఆర్ సభ అంటే రేవంతుకు కూడా అంత వణుకు పుడుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో మండల కన్వీనర్ చౌదరపెల్లి శేఖర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లడారు. రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వకుండా.. ఇప్పుడు జగిత్యాలలో కేసీఆర్ సభ పెడుతుంటే రెండో విడత వేస్తానంటూ రేవంత్‌రెడ్డి మభ్యపెడుతున్నారన్నారు. ఎస్సెల్బీసీ కూలి 8 మంది మృతి చెందితే ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు. పాలమూరు-రంగారెడి పంప్ హౌజ్ మోటర్లు మునిగినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు.
మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగిపోతే రిపేర్లు చేయకుండా రేవంత్ రాజకీయంగా కేసీఆర్‌ను బదనాం చేస్తున్నాడన్నారు. అక్కడికి ఎవ్వరినీ వెళ్లనీయని రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు వెళ్తున్నాడో చెప్పాలన్నారు. రాష్ట్రంలో సాగుతున్నది రాక్షస పాలన అని, విధ్వంసమే అభిమతంగా మారిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ‘కేసీఆరే నా దేవుడు.. చరిత్రలో లిఖించేలా నన్ను తెలంగాణ రాష్ట్ర తొలి డిప్యూటీ సీఎంగా చేశారు’ అని గుర్తుచేసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ గుర్తుపై, పార్టీ కార్యకర్తల శ్రమతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ప్రకటిస్తూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని ఎద్దేవా చేశారు. కడియంను నిలదీసే హక్కు ప్రతి గులాబీ కార్యకర్తకు ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ సర్పంచ్‌లు, కార్యకర్తలు నిలదీయాలని, గ్రామ సభలు, సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ తరఫున సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లుగా గెలిచిన, ఓడిన అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్, పార్టీ సభ్యత్వ నమోదు మండల ఇన్చార్జి కుమార్‌గౌడ్, మండల మాజీ అధ్యక్షులు దుంబాల భాస్కర్‌రెడ్డి, ఏదునూరి వీరన్న, మండల కార్యదర్శి కేమిడి వెంకటేశ్, నాయకులు రాపోలు శ్రీనివాస్, ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్‌లు ఎడ్ల లావణ్యరాజు, బండ శోభా చంద్రమౌళి, గొరిగె ఉప్పలమ్మ, భూక్యా నరసింహ, చెరుకు కార్తీక్, బీఎల్ఏలు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.