ధర్మసాగర్, జూన్ 17 : అమలు కాని హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పాలన చరిత్రలోనే అట్టర్ప్లాప్గా నిలిచిందని, తెలంగాణలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా చేశారని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు. మంగళవారం ధర్మసాగర్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కడియం అనుచరులు చేతివాటం చూపిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి భయపడి అధికారులు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు రైతులను బ్యాంకుకు వెళ్లి రుణాలు తెచ్చుకోండని చెప్పి కనీసం రుణమాఫీ చేయలేదని విమర్శించారు.
ఓటుకు నోటు కేసులో పట్టపగలే రూ.50లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ సీఎం రేవంత్రెడ్డి అని, దొంగే దొంగ అన్నట్లుగా రేవంత్రెడ్డి వ్యవహారం ఉన్నదని రాజయ్య ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని హెచ్చరించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం శ్రీహరికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో మండల నాయకులు బొడ్డు ప్రభుదాస్, శాతబోయిన రమేశ్, మేకల విజయ్, కొయ్యడ మహేందర్, లక్క శ్రీనివాస్, బేరే మధుకర్ తదితరులు పాల్గొన్నారు.