కురవి, అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని, శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల తర్వాత తటస్థంగా ఉంటున్న రైతుబంధు సమితి మాజీ మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేశ్‌ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. బలపాల లింగ్యాతండాకు చెందిన పలువురు యువకులకు పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లో చేర్చుకున్నారు.
అనంతరం రెడ్యా మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు మోసపోయారన్నారు. తెలంగాణ ఇంటి పార్టీగా బీఆర్ఎస్కు ప్రజల్లో గౌరవం ఉందని, ఈసారి ఓడిపోయినందుకు తాను బాధపడడంలేదన్నారు. తాను నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశానో.. సమస్యలు ఎలా పరిష్కరించానో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నదన్నారు. మూడు నెలలకోసారి వచ్చే ఎమ్మెల్యే గురించి తాను మాట్లాడనని, ప్రజల అవసరాలు దేవుడెరుగు కాంగ్రెస్ కార్యకర్తలకైనా పనిచేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను తమకున్న బాకీపై ప్రశ్నించేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కృషిచేసి ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీని గెలిపించుకోవాలన్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగొద్దని కాంగ్రెస్ చూస్తున్నదని, జరగాలని బీఆర్ఎస్ కోరుకుంటున్నదన్నారు. గ్రామపార్టీ అధ్యక్షుడు నామ సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవి, దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, రాజునాయక్, బత్తుల వెంకన్న, రొయ్యల నాగేశ్వర్రావు, గుగులోత్ రాంలాల్, బత్తుల వెంకన్న, చంద్రారెడ్డి, బాలవర్ధన్, కృష్ణమూర్తి, రవి, దేవేందర్, ప్రభాకర్, భోజ్యానాయక్, రమేశ్, రాము, సూర్య, శ్రీశైలం, మొగిలిచర్ల లక్ష్మీనారాయణ, రావూరి ప్రభాకర్‌రావు, పిట్టల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.