వరంగల్ చౌరస్తా, ఆగస్టు 10: ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో మౌలిక వసతుల ఊసే ఎత్తడం లేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధ్వజమెత్తారు. ఎంజీఎం ఆవరణలో శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై నన్నపునేని ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎంజీఎం గేటు ఎదుట బైటాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన మనస్సును కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంజీఎంలో మౌలిక వసతుల కల్పనకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఈ ఘటనకు కారకులైన వారికి పోలీసులు గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు విధులకు హాజరు కాకున్నా పట్టించుకోవడం లేదని, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు నిలిపివేశారని విమర్శించారు.
వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా మార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు 24 అంతస్తులతో దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలతో నగరం నడిబొడ్డున హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన హాస్పిటల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. శిశువు మృతదేహం విషయంలో సూపరింటెండెంట్‌ను వెంటనే ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, నాయకులు మసూద్, బజ్జూరి వాసు, వేల్పుగొండ యాకయ్య, దాచేపల్లి సీతారాం, మేరుగు ప్రవీణ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.