కృష్ణకాలనీ, నవంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు వేల మందితో దీక్షా దివస్‌ను నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షా దివస్‌పై గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 200 నుంచి 300, భూపాలపల్లి అర్బన్, రూరల్ నుంచి 1,000 నుంచి 1,500 మందిని, మొత్తంగా 2,000 నుంచి 2,500 మందిని తరలించాలన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఇంటింటికి తెలిసేలా సభను నిర్వహిస్తామన్నారు. నవంబర్ 29, 2009న మహానాయకుడు కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రపై చెరగని ముద్ర వేశారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివన్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఉదయం 9.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి, అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్తూపానికి, అనంతరం జయశంకర్ సెంటర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రమాణికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ నిరాహార దీక్ష, మలిదశ ఉద్యమ చరిత్రను వీడియో రూపంలో చూపించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని గండ్ర తెలిపారు.
సమావేశంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, భూపాలపల్లి రూరల్ అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అర్బన్ యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడా హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు ముంజంపల్లి మురళీధర్, దార పూలమ్మ, కో ఆప్షన్ మెంబర్ దొంగల ఐలయ్య యాదవ్, నాయకులు గురజాల శ్రీనివాస్, బీబీ చారి, జోరు ఈశ్వర్, శ్రీకాంత్ పటేల్, కృష్ణమూర్తి, భాసర్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.