వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 19 : భార్యాభర్తల తగాదాలో తలదూర్చి కుటుంబ విలువలను, బంధుత్వాలను తెంచేలా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం మార్చురీలో లకావత్ శ్రీను మృతదేహాన్ని శనివారం ఆయన సందర్శించి నివాళులర్పించి, మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.
కుటుంబ తగాదా విషయంలో కౌన్సెలింగ్ నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు పోలీసులు శ్రీనును వేధింపులకు గురిచేయచడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎర్రబెల్లి తెలిపారు. ఇది నూటికి నూరు శాతం కాంగ్రెస్ నాయకులు చేసిన హత్య అని అన్నారు.
అధికారం శాశ్వతమని భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు శ్రీను మృతితోనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క రోజూ తాను పోలీసులను అడ్డుపెట్టుకొని కుట్రలు చేయలేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన పోలీసు అధికారులతో పాటు వారి విధులకు ఆటంకం కల్పించిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఆయన వెంట మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, తదితరులు ఉన్నారు.
వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందిన లకావత్ శ్రీను కుటుంబసభ్యులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పరామర్శించి, తన సానుభూతి తెలియజేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి రూ.15 వేల ఆర్థికసాయం అందించి, కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.